1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: శుక్రవారం, 23 నవంబరు 2018 (19:01 IST)

ఎన్నికల్లో తెరాస కల్లోలమవుతుందా? కేసీఆర్ ఎందుకలా అన్నారు...?(Video)

తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన నాడు కనిపించిన సానుకూల వాతావరణం ఇప్పుడు లేదా అంటే అవుననే సమాధానం  చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో రెండోసారి కూడా టీఆర్ఎస్ కారుకు బ్రేకులు లేవని అభిప్రాయం వ్యక్తం చేసిన రాజకీయ పండితులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. రెండోసారి గెలుపు ఖచ్చితంగా కేసీఆర్‌దే అన్న పరిస్థితి నుంచి గెలుస్తారా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు, ఉత్తమ్, రేవంత్, ప్రొఫెసర్ కోదండరాం, గద్దర్ ఇలా ప్రజాకూటమి నేతలు వేస్తున్న  ఎత్తుగడలు, కేసీఆర్ కారు స్పీడుకి బ్రేకులు వేస్తాయన్న వాదన బలపడుతోంది. 
 
అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి మాది రైతుబంధు పార్టీ కాంగ్రెస్‌ది రాబంధుల పార్టీ అంటూ కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ నిప్పులు చెరుగుతూ వచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ నేతలు సన్నాసులు, దద్దమ్మలూ అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బలహీనపరిచే ప్రయత్నం చేసింది. అయితే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం టీడీపీని తమతో కలుపుకొని, గద్దర్, కోదండరామ్ లాంటి భావసారూప్యత ఉన్న నేతలను కూటమి గొడుగు కిందకి తెచ్చి టీఆర్ఎస్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. 
 
'ఈ ప్రజా కూటమి మాయా కూటమిగా కేసీఆర్ వర్ణించినా జరుగుతున్న పరిణామాలు చూస్తే అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఉద్యమ నేతగా, అసలైన తెలంగాణవాదిగా పేరుబడ్డ ప్రొఫెసర్‌గా కోదండరాం జనగాం సీటును కాంగ్రెస్‌కు త్యాగం చేసి, ప్రచారానికే పరిమితం అవుతుండటం కూడా ప్రజల్లో ఆయన పట్ల సానుకూల దృక్పధాన్ని పెంచింది. అంతేకాదు గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళుతున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసనలు సెగ తగలడంతో కొంతమేర పరిస్థితికి అద్దం పడుతోంది. తాజా రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం దనదైన రీతిలో వ్యూహాలు రచిస్తోంది. 
 
కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్‌ని రంగంలోకి దింపి టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించింది. అంతేకాదు రాబోవు పదిరోజులు ప్రచార జోరు పెంచనుంది. సోనియా, రాహుల్ గాంధీ సభలు ద్వారా క్యాడెర్లో జోష్ నింపి తద్వారా ప్రచారంలోని పైచేయి సాధించాలని భావిస్తోంది. అంతేకాదు ఎపీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడుని వ్యూహాలు, ఎన్నికల ఎత్తుగడలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. 
 
తెలంగాణలో ప్రజాకూటమి జెండా ఎగురవేయడం తథ్యమని గంటాపథంగా చెబుతున్నారు ప్రజాకూటమి నేతలు. టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదని, గెలిపిస్తే గట్టిగా పనిచేస్తానని లేదంటే రెస్ట్ తీసుకుంటానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఉదహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏదిఏమైనా తెలంగాణలో మాత్రం పోరు హోరాహోరిగా ఉండబోతుంది. చూడండి... కేసీఆర్ ఏమన్నారో ఈ వీడియోలో...