1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (22:25 IST)

సింగరేణి ఉద్యోగులకు రూ.కోటితో ప్రమాద బీమా సదుపాయం : సీఎం రేవంత్ రెడ్డి

singaren employees insurance
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని, తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రయివేటుపరం చేయడాన్ని బీఆర్ఎస్ అడ్డుకోకపోగా ప్రోత్సహించిందని ఆరోపించారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. 
 
రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నామని, రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి రూ.6 వేల కోట్లు అప్పులు చెల్లించేదన్నారు. పదేళ్లలో ఏడాదికి రూ.70వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే.. రూ.70 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి దివాళా తీయించారని మండిపడ్డారు. ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ప్రతీ నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్టు గుర్తుచేశారు. మార్చి 31లోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా... నిస్సిగ్గుగ్గా బీఆరెస్ మమ్మల్ని విమర్శిస్తోందని మండిపడ్డారు. 
 
ఆర్థిక నియంత్రణ పాటిస్తూ.. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా మా ప్రభుత్వం బడ్జెట్ ఖర్చు చేస్తోందన్నారు. మమ్మల్ని అభినందించాల్సింది పోయి.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అబద్దాలు చెబుతున్నారన్నారు. ఇది నలుగురి ఘోషనే తప్ప వాళ్ల పార్టీ వాళ్లు కూడా ఆమోదించడం లేదన్నారు. మేం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నామని, ఉద్యోగ నియామకాల్లో చిక్కుముడులు విప్పుతూ 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. నిర్లక్ష్య ధోరణితో బీఆరెస్ గాలికి వదిలేస్తే మేం నియామకాయాలు చేపట్టామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు తెలిపారు. మీరు ఎక్కడికక్క వదిలేసిన సంసారాన్ని మేం చక్కదిద్దుతున్నామని, మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది అంటుంటే మేడిగడ్డలో నీళ్లు అన్నారంలో పోయాలని హరీష్ అంటున్నారని, హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా? ఎలా కుంగిపోయిందో సమాధానం చెప్పరు.. చూసొద్దామంటే రారని, బీఆర్ఎస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. 
 
కృష్ణా జలాలపై వాళ్లు మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారని, ఈ వేదికగా బీఆరెస్, బీజేపీలకు సవాలు విసురుతున్నట్టు ప్రకటించారు. మీ 2014, 2018 ఎలక్షన్ మేనిఫెస్టో.. 2023లో మా ఆరు గ్యారెంటీల హామీలపై ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చిద్దామన్నారు. ఇందుకు బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమా? అని ఛాలెంజ్ విసిరారు. బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు. మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణాకు కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినపుడు నిధులు తెచ్చారా? మీకు కేసీఆర్‌కు తేడా ఏం లేదని, ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని నిలదీశారు. 
 
మంగళవారం సాయంత్రం 5గంటలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ పథకాలను ప్రారంభిస్తున్నామన్నారు. మిమ్మల్ని ఆహ్వానించినా ఎందుకు రావడంలేదని, బాధ్యత లేకుండా బీజేపీ, బీఆరెస్ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కాంక్షతో ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురాశ తప్ప బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వేరే ఆలోచనలేదన్నారు. బరువు, బాధ్యతతో ప్రజలకు సేవచేస్తున్నామన్నారు. శక్తినంతా కూడదీసుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నట్టు చెప్పారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు లేదన్నారు. గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియ.. అర్హులు ఎప్పుడైనా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు.