గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (09:30 IST)

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

sitaphal bala nagar
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌లో పండే సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు(జీఐ) కోసం దరఖాస్తు చేయాలని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అధ్యయనాలు చేపట్టి గణాంకాలు సేకరిస్తుండగా.. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూ.12.70 లక్షల సాయం అందించేందుకు ముందుకొచ్చింది. 
 
బాలానగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు విస్తరించింది. ఆగస్టు చివరి నుంచి నవంబరు చివరి వరకు ఇది ఆ ప్రాంతాల్లోని ప్రజలకు, ప్రధానంగా గిరిజనులకు ఉపాధి కల్పిస్తుంది. రుచి, నాణ్యతకు పేరొందిన బాలానగర్ సీతాఫలాలు తెలంగాణ రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. 
 
అయితే, విస్తృత ప్రాచుర్యం పొందిన వీటికి పోటీగా హైబ్రిడ్ పండ్లు మార్కెట్లోకి వస్తుండడంతో బాలానగర్ ఫలాల విశిష్టతను కాపాడుకునేందుకు జీఐకి దరఖాస్తు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం సంకల్పించి అందుకు అవసరమైన కసరత్తు చేపట్టింది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధ రక్షణ కలుగుతుందని తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు.