శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 18 నవంబరు 2024 (19:56 IST)

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

Turmeric, Basil leaves Water
కారం, పసుపు, ఇతర మసాలా దినుసుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉందని తరచుగా వింటుంటాం. మరి నిజంగానే వీటన్నింటి వల్ల మన ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయా? మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి సాయపడుతున్నాయా? చిప్స్‌లో మిరియాల పొడి చల్లుకోవడం, టీ లో అల్లం వేసుకోవడం, దాదాపు అన్ని రకాల వంటల్లో మిరపకాయలను వాడటం- ఇలా మసాలా దినుసులు వేల సంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో కొన్ని మసాలా దినుసులు రోగాలను నయం చేసే ‘సూపర్‌ ఫుడ్స్’ అనే ప్రచారం అనధికారికంగా జరుగుతోంది.
 
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో, హిల్లరీ క్లింటన్ అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు రోజూ ఒక మిరపకాయ తిన్నారు. ఆసియాలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పసుపు, "గోల్డెన్ లాటే" కాఫీ రూపంలో ప్రపంచవ్యాప్తంగా కెఫేల్లోకి అడుగు పెట్టింది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న వీడియోలు కోవిడ్ మహమ్మారి సమయంలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అన్నిచోట్లా పసుపు ఒక ‘సెలబ్రిటీ షెఫ్‌’గా మారింది. బరువు తగ్గడానికి మంచి సాధనంగా ఒక దశాబ్దం క్రితం బాగా ప్రచారం జరిగిన "బియాన్సే డైట్" (ఎర్ర మిర్చి, మేపుల్ సిరప్, నిమ్మకాయ నీరు కలిన మిశ్రమం) ఇప్పటికీ చాలా మంది తీసుకుంటున్నారు.
 
అయితే, మసాలా దినుసులతో నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? అనారోగ్యాన్ని దూరం చేయడంలో ఇవి మనకు సహాయపడతాయా? హాని కలిగించే మసాలా దినుసులు కూడా ఉంటాయా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
 
మిరపతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
మిరపకాయలను మన వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తాం. ఆరోగ్యంపై వీటి ప్రభావాలను అనేక అధ్యయనాలు పరిశీలించాయి. అయితే ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు, ప్రతికూల పరిణామాలనూ కనుగొన్నారు. మిరపలో ప్రధానంగా క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. మిరపకాయలను తిన్నప్పుడు, ఈ రసాయనం మన శరీరంలో ఉష్ణోగ్రత సృష్టించడానికి మెదడుకు సంకేతాలను పంపుతుంది. క్యాప్సైసిన్ ఎక్కువ కేలరీలను ఖర్చు చేసేందుకు సహాయపడుతుందిని, ఆకలిని తగ్గించగలదని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
 
మనిషి ఎక్కువ కాలం జీవించడానికి క్యాప్సైసిన్ సాయపడుతుందని చెబుతారు. మిరపకాయలను ఎప్పుడూ తినని వారితో పోలిస్తే వారానికి నాలుగు సార్లు మిరపకాయలతో కూడిన ఆహారాన్ని తినే వ్యక్తులు మరణించే ప్రమాదం తక్కువ అని 2019లో ఓ ఇటాలియన్ అధ్యయనం తేల్చింది. 2015లో చైనా పరిశోధకులు దాదాపు 5,00,000 మందిపై మిరపకాయ తినడం వల్ల కలిగిన ప్రభావాన్ని పరిశీలించిన్నపుడు కూడా ఇదే తేలింది. వారానికి ఒకసారి స్పైసీ ఫుడ్స్ తినే వారి కంటే దాదాపు ప్రతిరోజూ స్పైసీ ఫుడ్స్ తినే వారు మరణించే ప్రమాదం 14 శాతం తక్కువ అని అప్పుడు పరిశోధకులు చెప్పారు.
 
జ్ఞాపకశక్తిపై ప్రభావం ఉంటుందా?
"మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల కారణంగా సంభవించే మరణాల ప్రమాదం తక్కువ’’ అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో న్యూట్రిషన్ పరిశోధకుడు ప్రొఫెసర్ లు క్వి అన్నారు. అయితే, మిరపకాయలను పెద్ద మొత్తంలో తినడం ప్రారంభిస్తే ఆరోగ్యానికి వెంటనే మేలు కలుగుతుందని, కొద్ది రోజుల్లోనే మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, శ్వాసకోస సబంధిత అనారోగ్యం దూరమవుతుందని అర్థం కాదు. చైనా అధ్యయనంలో కనీసం ఏడేళ్లపాటు మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకున్నవారిపైనే నిర్వహించారన్న విషయం మర్చిపోకూడదు. మిరపకాయలు ఆరోగ్యాన్ని సంరక్షించడమన్నది నిజమే కానీ, వాళ్లలా ఆరోగ్యంగా మారడమన్నది వారాలు, నెలల వ్యవధిలో జరిగిపోలేదు.
 
క్యాప్సైసిన్ మన శక్తిని పెంచుతుందని, ఆకలిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మిర్చి వినియోగం అధిక రక్తపోటును నియంత్రించగలదని, ఊబకాయం బారిన పడకుండా రక్షిస్తుందని ఖతార్ యూనివర్శిటీ మానవ పోషకాహార విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ జుమిన్ షి తన అధ్యయనంలో తేల్చారు. అయితే, మిరప వినియోగాన్ని, ఆలోచనాశక్తిని పోల్చిచూస్తే.. ఎక్కువ మిరపకాయలు తినేవారి ఆలోచనా తీరులో మార్పును చైనా పరిశోధకులు గమనించారు. ప్రధానంగా జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం ఉంది. తమ జ్ఞాపకశక్తి క్షీణించిదని స్వయంగా అధ్యయనంలో పాల్గొన్నవారే అన్నారు. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ మిరపకాయలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం దాదాపు రెట్టింపు అని జుమిన్ షి నిర్ధరించారు. అయితే, క్యాప్సైసిన్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై 11 అధ్యయనాలను 2022లో పరిశీలించి, అధ్యయనాల నాణ్యత అంతంత మాత్రంగానే ఉందని, ఫలితాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని ఒక విశ్లేషణ నిర్ధరించింది.
 
పసుపుతో ప్రయోజనాలు
పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాల మంది నమ్ముతారు. పసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది. పసుపును సాధారణంగా వాపును తగ్గించడానికి, ఇతర అనారోగ్య పరిస్థితులకు ప్రత్యామ్నాయ వైద్యంగా ఉపయోగిస్తారు. పసుపుతో ప్రయోజనం ఉంటుందని చెప్పడానికి సరిపడా ఆధారాలు మాత్రం లేవు. కర్కుమిన్‌కు క్యాన్సర్‌ను నిరోధించే సామర్ధ్యం ఉందని ప్రయోగశాలల్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ప్రయోగశాల వాతావరణం, మానవ శరీరం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కర్కుమిన్ కలిగించే ప్రయోజనాలపై ఆధారాలు లేవు. మసాలా దినుసులకూ ఇది వర్తిస్తుంది. అలాగే కొన్నిమసాలాల్లో లభించే పదార్థాల సప్లిమెంట్ల ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధకులు అధ్యయనం చేసినప్పుడు అనుకూలమైన ఫలితాలే వచ్చాయి.
 
ఉదాహరణకు, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లతో సహా అటో-ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు రోజు అల్లం తీసుకోవడం వల్ల వాపును నియంత్రించవచ్చని 2023లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ‘‘పసుపు సహా మసాలా దినుసులను ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగించాలన్న ఆసక్తి పాశ్చాత్య సమాజంలో వందేళ్లకు ముందే కనిపించింది. అప్పట్లో మసాలా దినుసులను చికిత్సకు ఉపయోగించవచ్చన్న ఆలోచన ఉండేది’’ అని యేల్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ పాల్ ఫ్రీడ్‌మాన్ చెప్పారు.
 
సమతుల్యం కోసం మసాలా దినుసులు
‘‘ఆహారంలో సమతుల్యం కోసం మసాలా దినుసులను ఉపయోగిస్తారు. వేడి, చల్లని, తేమ, పొడి వంటివాటిని ఇవి సమతుల్యం చేస్తాయి’’ అని ఫ్రీడ్‌మ్యాన్ చెప్పారు. చేపను చల్లని, తడి ఆహారం అనుకుంటే మసాలా దినుసులు ఆ ఆహారంలోకి కావాల్సిన వేడిని అందిస్తాయి. ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించడం, వేడి, చల్లదనం, పొడి, తడి వంటివాటిని సమతుల్యపరచడం వంటివి ఆయుర్వేద వైద్యం ప్రధాన సిద్ధాంతాలు. భారత్‌లో వేల ఏళ్లుగా ఇది ఉపయోగిస్తున్నారు.
 
చాలా పాశ్చాత్య దేశాల్లో సమతుల్య ఆహారాన్ని కొత్త రకం ‘వైద్యం’గా ఉపయోగించడమన్నది ఇప్పుడు కొత్తగా వినపడతోందని ఫ్రీడ్‌మాన్ చెప్పారు. ‘‘50 ఏళ్ల కిందటితో పోలిస్తే మసాలా దినుసులను ‘ఔషధం’లా ఉపయోగించడం ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఒకప్పుడు యాంటిబయాటిక్స్ వంటి ఆధునిక వైద్యం, ప్రాచీన వైద్యం మధ్య ఒకప్పుడు కనిపించే గోడ ఇప్పుడు లేదు’’ అని ఆయనన్నారు. యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటాలో పనిచేసిన మాజీ రీసెర్చ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాథరిన్ నెల్సన్.. కొత్త ఔషధాలలా మసాలా దినుసులు పనికొస్తాయా అన్నది పరిశీలించాలని భావించారు. కర్కుమిన్‌ చుట్టూ ఉన్న వాదనలపై అధ్యయనం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
 
"టెస్ట్ ట్యూబ్‌లలో పెరిగే కణాలపై పరిశోధనలు చేయాలని భావించారు. కానీ కర్కుమిన్ దాని అణువులు జీర్ణమైన తర్వాత శరీరం వాటిని ఉపయోగించుకోదని ఆమె గుర్తించారు. కర్కుమిన్‌ను చిన్న పేగు సులభంగా గ్రహించదు. చిన్నపేగు, పెద్ద పేగుల్లోని ప్రొటీన్లతో కర్కుమిన్ కలిసినప్పుడు దాని నిర్మాణం మారిపోతుంది. ఫలితంగా కర్కుమిన్‌తో పెద్దగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు” అని కాథరిన్ అన్నారు. “పసుపులో ప్రయోజనకరమైనది ఏదైనా పదార్థం ఉండవచ్చు. కానీ, అది కర్కుమిన్ కాదు’’ అని ఆమె అన్నారు. పసుపును వంట తయారిలో వాడితే, ఇతర ఆహారపదార్థాలతో పాటు కలిసిపోతుంది. చాలా పసుపు వాడడం అనేది ప్రమాదకరం కాదు. కానీ సొంత వైద్యానికి దానిని ఉపయోగించకపోవడమే మంచిది’’ అని ఆమె చెప్పారు.
 
ప్రభావాలకు గల కారణాలేంటి?
మిరప, పసుపుపై విస్తృత అధ్యయనాలు జరిగినప్పటికీ, వాటిని వాడడం వల్ల ఆరోగ్యంపై కలిగే అనేక రకాల ప్రభావాలను మాత్రమే ఆ అధ్యయనాలు పోల్చిచూపుతున్నాయి. ప్రభావాలకు గల కారణాల్ని అధ్యయనాలు కచ్చితంగా నిర్ధరించలేదు. ఇది చాలా కష్టం కూడా. ప్రయోగశాలలో వచ్చిన ఫలితాలు మానవ శరీరానికి పూర్తి స్థాయిలో వర్తించకపోవచ్చు. 2019లో జరిగిన ఇటాలియన్ అధ్యయనం విషయానికే వస్తే, మిరపకాయల వినియోగం వల్ల మరణం ముప్పు తగ్గుతుందని తేలింది. ఇది ఒక పరిశీలన మాత్రమే. అయితే మిరపకాయలు మనుషులు ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయా లేదా అన్నది తెలుసుకోవడం అసాధ్యం. ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్న వారు మిరపకాయలను ఎక్కువగా తింటున్నవారా లేక.. వారి ఆరోగ్యానికి మరింకేదైనా కారణం ఉన్నదా? అన్నది తేల్చలేం.
 
వాస్తవానికి మసాలాల ఆరోగ్య ప్రయోజనాలు, మనం వాటితో పాటు తినే ఆహారం నుంచి వస్తాయని చాలా మంది పరిశోధకులు నమ్ముతారు. ‘‘మసాలా దినుసులు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఉప్పుకు అవి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి’’ అని న్యూయార్క్‌లోని NYU లాంగోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లిపి రాయ్ చెప్పారు. ఉప్పు, కొవ్వుపదార్థాలు వంటి వాటికి బదులుగా మసాలా దినుసులను వాడటం వల్ల ప్రఖ్యాత వంటలను ఎక్కువ మంది ఆస్వాదిస్తారని గత సంవత్సరం పరిశోధకులు నిర్వహించిన ప్రయోగంలో తేలింది.
 
మిరపకాయలను కూరగాయలతో కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మసాలా దినుసులు మనకు ఎలాంటి హాని చేయనప్పటికీ, జబ్బుల బారిన పడకుండా తప్పించుకోడానికి మనం వాటిపైనే ఆధారపడకూడదు. ఆయా సీజన్లలో దొరికే కూరగాయలతో వాటిని కలిపి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.