శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 మే 2024 (19:11 IST)

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

KCR
కర్టెసి-ట్విట్టర్
భారత పార్లమెంటు ఎన్నికల్లో చక్రం తిప్పాలని తెరాస పేరును భారాసగా మార్చుకుని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది కేసీఆర్ పార్టీ. ఇక అప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ మంత్రానికి భారాస నుంచి వలసలు పెరిగిపోతుండటంతో కేసీఆర్ మదిని సలసలమనిపిస్తున్నట్లున్నాయి. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయి కాస్త కోలుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సీఎం రేవంత్. ఇక కేసీఆర్ గారికి బస్సు యాత్ర తప్పలేదు.
 
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనను సామాన్య పౌరులు కలవాలంటే చాలా కష్టమనే వాదన వుండేది. ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని కేసీఆర్ గారు రోడ్డుపై తిరుగుతూ అవకాశం వున్నప్పుడల్లా జనంలో కలిసిపోతున్నారు. తాజాగా కామారెడ్డి బస్సు యాత్రలో భాగంగా ఇందల్వాయి టోల్ ప్లాజ్ దగ్గర రోడ్డు పక్కన వున్న ఓ హోటల్లో ఆయన ఆగారు. కేసీఆర్ గారిని చూడగానే అభిమానులు, ప్రజలు ఆయన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కేసీఆర్ కూడా వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
 
ఐతే... సీఎంగా వున్నప్పుడు ఆయన ప్రజలకు దూరంగా వున్నారన్న విమర్శ వుంది. ఇప్పుడు పరాజయం పాలయ్యాక ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. మరి కేసీఆర్ పార్టీ భారాసకి ఎన్ని సీట్లు తెస్తాయో చూడాల్సి వుంది. మరోవైపు తెరాసగా పార్టీ పేరు వున్నప్పుడు ఆ పార్టీకి తిరుగులేకుండె. కానీ భారాసగా మారిన దగ్గర్నుంచి పార్టీకి ఆ పేరు ఓ గుదిబండలా మారిందని, అచ్చిరాలేదన్న వాదన కూడా గట్టిగా వినబడుతోంది. మరి పార్టీ పేరు కూడా మార్చుకుంటే ఫలితాలు ఏమైనా ఆశాజనకంగా వుంటాయేమో?!!