శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (14:11 IST)

నిప్పుల కొలిమిగా తెలంగాణ : రెండు రోజుల భగభగలే...

temparature
తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారిపోయింది. రానున్న రెండు రోజుల పాటు సూర్యదేవుడు తన ప్రతాపం చూపుతారని తెలిపారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడిమికితోడు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 
 
శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వరుసగా రెండో రోజు కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేసి 45.6 డిగ్రీలకు చేరుకున్నాయి. అంతకుముందు రోజు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, ములుగు జిల్లా మల్లూరు 45.2, జగిత్యాల జిల్లా వెల్గటూరు, ములుగు జిల్లా ధర్మవరంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. 
 
హైదరాబాద్ ముసాపేటలోని బాలాజీనగర్ లో అత్యధికంగా 43 డిగ్రీలు రికార్డు కాగా, నగరంలోని మిగతా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం, సోమవారం ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. 
 
ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. కాగా, వడదెబ్బ కారణంగా సూర్యాపేట జిల్లా కొత్తగోతండాకు చెందిన కూలీ బానోత్ మంగ్యా (40), హనుమకొండ జిల్లా పులుకుర్తికి చెందిన ఎండనూరి రాజు (35) ప్రాణాలు కోల్పోయారు.