సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (13:43 IST)

తెలంగాణ బంగారు పెళ్లెం కాదు.. అప్పుల కుప్ప : మంత్రి జూపల్లి కృష్ణారావు

jupalli krishna rao
బంగారు పళ్లెంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేశారని ఆ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తప్పుబడుతున్నారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని వివరణ ఇచ్చారు. 
 
'భారాస ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. భాజపా తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో భారాస మద్దతు ఇచ్చింది. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదు. 
 
2018 ఎన్నికలప్పుడు భారాస చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు. గతంలో విపక్షాలు తెరాసను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. పసికందును విమర్శిస్తున్నారా? అని వాపోయారు. మరి భారాస నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే 'ప్రజాపాలన' నిర్వహించాం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తాం. 
 
లోక్‌సభ ఎన్నికల్లో భారాస తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. భారాసను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోయాయి. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం?' అని జూపల్లి అన్నారు.