ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (18:04 IST)

ఐటి పరిశ్రమల స్థితులపై జాతీయ స్ధాయిలో ఒక స్ట్రాటజీ గ్రూపు: మంత్రి కేటీఆర్

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పలు అంశాలపై కీలక సూచనలు చేశారు.

అన్ని రాష్ట్రాల ఐటిశాఖ మంత్రులతో జరిగిన ఈ సమావేశంలో  కోవిడ్ 19 వ్యాధి సంక్షోభం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు.

కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ముఖ్యంగా ఐటి సంబంధిత కార్యక్రమాల పైన ఆయా రాష్ట్రాల మంత్రులు పలు సలహాలు సూచనలు చేశారు.
 
ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలోనూ అనేక అవకాశాలను పరిశ్రమలు అందుకునే పరిస్ధితులు ఉన్నాయని, ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహాయకారిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు ఈ వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు.

ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తామని బహిరంగంగా చెప్తున్న నేపథ్యంలో చైనా నుంచి తరలి పోయే పరిశ్రమలు ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలను భారతదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని  తద్వారా పెద్ద ఎత్తున దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు  నిండిపోయిన నేపథ్యంలో మరో రెండు ఈఎంసీల కు అనుమతులు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కోరారు.

ఇప్పటికే కరోనా కట్టడి, లాక్ డౌన్ అనంతరం వ్యాపార వాణిజ్యాల నిర్వహాణ పైన వివిధ దేశాలు ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మేధావులతో స్ట్రాటజీ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాయని, భారత దేశంలోని ఐటీ సంబంధిత పరిశ్రమకు కూడా ఇక్కడి ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో, ఆయా రంగాల నిపుణులతో స్ట్రాటజీ గ్రూపును ఏర్పాటు చేయాలని సూచించారు.

తద్వారా వైరస్ అనంతర పరిస్థితుల్లో వ్యాపార వాణిజ్యం కొనసాగే ఈ విషయంలో ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం అనేక కంపెనీలు పెద్ద ఎత్తున వర్క్ ఫ్రొం హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని, సమీప భవిష్యత్తులోనూ ఇది కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ ఆధారిత అటాక్ లను తట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింత అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని  సూచించారు.

ప్రస్తుతం సంక్షోభం సందర్భంగా పెద్ద ఎత్తున ఇంటర్నెట్ ని ప్రజలు ఉపయోగిస్తున్న నేపథ్యంలో బ్రాడ్బ్యాండ్ మరియు నెట్వర్కుల బలోపేతం దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించాలన్నారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని సూచించారు.

ప్రస్తుతం బయోటెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫార్మా వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయని. ఈ రంగాల్లో  ఐటి ఆధారిత అవకాశాలు లేదా అయా రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక నూతన అవకాశాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని, వీటిని అందుకునేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ కామర్స్ ద్వారా ప్రాథమిక అవసరాలైన వస్తువుల నుంచి మొదలుకొని అన్ని రకాల సదుపాయాలు ఈ కామర్స్ రంగంలోకి వచ్చే అవకాశం ఉన్నదని,  ఈ నేపథ్యంలో ఈ కామర్స్ రంగానికి కూడా పెద్ద ఎత్తున సహాయం అందించాలని కోరారు.

ఐటీ  మరియు ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లోని ఎం ఎస్ ఎంఈ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో వాటికి జీఎస్టీ పన్నులు మరియు ఆదాయపు పన్ను వంటి వాటి విషయంలో పలు మినహాయింపులను ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ప్రస్తుతం అమెరికా యూరప్ వంటి దేశాల్లో కరోనా వ్యాధి వలన ఆయా ఆర్థిక వ్యవస్థల పైన చూపేటువంటి ప్రభావం వలన భారతదేశ ఐటి, అనుబంధ కంపెనీలకు ఏదైనా సమస్య ఎదురైతే వాటిని ఆదుకునేలా లేదా ఆయా రంగాల్లోని మానవ వనరులను ఇతర రంగాల్లో కి తరలించేలా, ఇతర రంగాలపైన ఇప్పటి నుంచే స్ధూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోని ఐటీ శాఖ మంత్రుల తో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించడడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 
 
సమావేశానంతరం మాట్లాడిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామన్నారు. కేటీఆర్ సూచించిన మేరకు ఐటి అనుబంధ రంగాలకు ఒక స్ట్రాటజీ గ్రూప్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో పాటు ఇంటర్నెట్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ నెట్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం  ప్రారంభించిన ఆరోగ్య సేతు సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులకు ఆయన సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆదర్శవంతమైన పద్ధతులు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మిగిలినవారు ఉపయోగించుకోవడానికి ఒక ప్రత్యేక పోర్టల్ ను మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

దీంతోపాటు ఈ కామర్స్ రంగానికి కూడా మరింత చేయూతను అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భారత పోస్టల్ శాఖ కు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ను ఉపయోగించుకొని తమ నగదు పంపిణీ వంటి కార్యక్రమాల్లో వాటి సేవలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.