టీఆర్‌ఎస్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
పురపాలిక ఎన్నికల టీఆర్‌ఎస్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ భవన్ నుంచి ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళిపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు దూసుకెళ్తోంది. అభ్యర్థులు, స్థానిక ఎమ్మెల్యేలు జోరు పెంచారు. పురపాలిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రచార సరళి, ఇతర పార్టీల ఎత్తుగడలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
తొమ్మిది సభ్యుల సమన్వయ కమిటీ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా కేటీఆర్ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.
సిరిసిల్లకు రైలు మార్గం
సిరిసిల్ల మునిసిపాలిటీకి సంబంధించి మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ మునిసిపాలిటీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానన్నారు. సిరిసిల్లలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేశానని స్పష్టం చేశారు.
సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని చెప్పారు. రెండు, మూడేళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్లను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.