మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (06:34 IST)

తెలంగాణ పురపోరు.. ఏరులై పారుతున్న మద్యం, మాంసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. మందు, విందు, చిందు వద్దన్నా ఓటర్లను  వెంటాడుతున్నాయి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా అడిగిన వారికి అడిగినంత వచ్చిపడుతున్నాయి.

రాష్ట్రంలో పురపోరు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఉదారంగా ‘పండుగ ఆఫర్ల’ను ఇస్తున్నారు. దీంతో మునిసిపాలిటీల్లో కాస్త ముందే సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలో సంక్రాంతి రోజున తన ఓటర్లకు ఓ అభ్యర్థి మస్త్‌ దావత్‌ ఇచ్చాడు.

కిలో మటన్‌ లేదంటే 2కిలోల చికెన్‌, ఒక ఫుల్‌ బాటిల్‌, లేదంటే 6బీర్లు, పిండి వంటల కోసం 5లీటర్ల డబ్బా నూనె డబ్బా పంపిణీ చేసేశాడు. మరో అభ్యర్థయితే తన వెంట తిరిగేవాళ్లకు సంక్రాంతి రోజున తలా ఓ ఫుల్‌ బాటిల్ ఇచ్చాడు. మామూలు రోజుల్లో ఓ క్వార్టర్‌ ఇస్తానని మాటిచ్చాడు.

గజ్వేల్‌ మునిసిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున గొర్రెలు తెగాయి. ఇంటింటికి తిరిగి మాంసం అందజేస్తూ ‘ఇదంతా తొలి విడతే’ అని చెబుతూ ముందు ముందు ఇంకా ఉంటుంది అనే సందేశాన్నిచ్చారు. సంగారెడ్డి మునిసిపాలిటీలో ఓటర్ల ఇళ్లకు సాయంత్రంలోగా మందు సీసాలు, మిక్చర్‌ ప్యాకెట్లు పంపిస్తున్నారు.

వైన్‌షాపుల వారితో మాట్లాడుకుని, ఓటర్ల ఇళ్ల జాబితా అందజేసినట్లు తెలిసింది. వైన్‌షాపు నిర్వాహకులే రోజు సాయంత్రం ఓటర్ల ఇళ్లకు మందు, మిక్చర్లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులు ప్రచారానికి కూలీలను మాట్లాడుకొని ఒక్కొక్కరికి రూ.500ల వరకు ఇస్తున్నారు.

మెదక్‌ జిల్లా రామాయంపేటలోని ఓ వార్డులో పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంక్రాంతి పిండి వంటల కోసం ఒక్కో ఇంటికి లీటరు చొప్పున రెండు ఆయిల్‌ ప్యాకెట్లు, కిలో శనగ పిండి అందజేశాడు. మరో వార్డులో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తనను ఓటేసి గెలిపిస్తే ఐదేళ్ల పాటు మినరల్‌ వాటర్‌ ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చాడు.

మరో వార్డులో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రూ.500 నుంచి రూ.2 వేల వరకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.రంగారెడ్డి జిల్లాలో పండుగ సాకుతో కొందరు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. నూనె, శనగపిండి, కిలో బియ్యం, ఉప్పు, పప్పు కారం ప్యాక్‌ చేసి మరీ పంపిణీ చేస్తున్నారు.

ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఓ ఫుల్‌బాటిల్‌ ఇచ్చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలోని మూడు వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులు క్వార్టర్‌, ఆఫ్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. చిట్యాలలోని 1వ వార్డులో నామినేషన్‌ వేసిన నాటి నుంచి ఇద్దరు అభ్యర్థులు ప్రతిరోజు.. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందుతో దావతులు ఇస్తున్నారు.

మిర్యాలగూడలో ముగ్గుల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి విలువైన బహుమతులను పాల్గొన్న వారందరికీ గృహోపకరణాలను పంచారు. నల్లగొండలో 20 మందికి ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి పార్టీలు ఏర్పాటు చేశారు. చండూరులో పండుగ ఖర్చుల పేరిట ఇరుపార్టీల అభ్యర్థులు ఇంటింటికీ రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేశారు.

ఒక వార్డులో అధికార పార్టీ అభ్యర్థి, ప్రతి ఇంటికి కిలో మేక మాంసం అందజేశారు. వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో సంక్రాంతికి మందు, విందును మొత్తం అభ్యర్థులే సమకూరుస్తున్నారు. ఇందుకు నేరుగా మాంసం దుకాణాలకు ఆర్డర్‌ చేశారు.

ఇంట్లో మగవారికి మద్యం, ఆడవారికి కూల్‌డ్రింక్స్‌లను అందజేస్తున్నారు. హుజూర్‌నగర్‌, నేరేడుచర్లలో స్వీట్‌ ప్యాకెట్లు, ఇంటింటికీ కిలో చికెన్‌ పంపిణీ చేశారు.