సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (21:32 IST)

రూ.2వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ రూ.300లకే..

మునుపెన్నడూ లేని రీతిలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఉన్న సరుకంతా క్లియర్ చేసుకునే ఉద్దేశంతో దుకాణదారులు మద్యం అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు, గిప్ట్ హ్యాంపర్లు ఇస్తూ మందుబాబులను ఆకర్షిస్తున్నారు.

నూతన మద్యం పాలసీలో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించనుండడంతో విజయవాడలోని ఓ షాపులో సుమారు రూ.2వేల ఖరీదు చేసే ఒక మందు సీసాపై రూ.300కు పైగా డిస్కౌంట్ ఇస్తున్నారు.

దీంతో పాటు ఒకేసారి మూడు నాలుగు బాటిళ్లు కొంటే లెథర్ బ్యాగ్‌లు, టూరిస్ట్ బ్యాగులు ఇస్తున్నారు. విజయవాడతో పాటు పలు నగరాల్లో ఈ విధంగానే డిస్కౌంట్లతో అమ్మకాలను సాగిస్తున్నారు.
 
పట్టణాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి గనుక అందుకు అనుగుణంగా భారీగా సరుకును నిల్వ ఉంచుకున్నవారు ఇప్పడు వాటిని క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. అదీకాక రెండేళ్లకోసారి షాపు లైసెన్సు గడువు ముగిసే సమయంలో మిగిలిపోయిన మద్యాన్ని ఎక్సైజ్‌శాఖ తీసుకుంటుంది.

తిరిగి లైసెన్సు తమకే వస్తుందని ఆశించిన వ్యాపారులు సరుకును నిల్వ చేసుకుని లైసెన్సు దక్కక గతంలో నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈసారి మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు పరం కానున్నందున వ్యాపారస్తులు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. ఉన్న సరుకుని ఎంతోకంతకు అమ్మేసుకుంటున్నారు.