వడ్డీరేట్లు తగ్గింపు : ఎస్‌బిఐ
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీరేట్లను ఇందుకు కారణంగా చూపింది. తక్కవ కాలపరిమితి కలిగిన (179 రోజుల్లోపు) డిపాజిట్లపై 50 నుంచి 75 బేసిస్ పాయింట్లను తగ్గించింది.
ఆపై కాలపరిమితి కలిగిన రిటైల్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు.. బల్క్ సెగ్మెంట్‌లో 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రూ.2కోట్లు ఆపై బల్క్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
ఇప్పటి 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.75 % అందిస్తున్న వడ్డీని 5%కి ఎస్‌బీఐ తగ్గించింది. 46 నుంచి 179 కాలపరిమితి డిపాజిట్లపై 6.25% ఉన్న వడ్డీ రేటును 5.75% కు, 180 నుంచి 210 రోజుల కాలపరిమితి డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లు కోత విధించి 6.25% వడ్డీ అందించనుంది.
211 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై 6.40%గా ఉన్న వడ్డీ రేటును 6.25%కి తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 7%గా ఉన్న వడ్డీ రేటును 6.80%తగ్గించింది. 10 ఏళ్ల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై మార్పులు చేసింది.