సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (19:33 IST)

#TripleTalaqBillకు రాజ్యసభ గ్రీన్‌సిగ్నల్.. ఓటింగ్‌లో విజయం

లోక్‌సభలో పాసైన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమే ఈ బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. 
 
ప్రపంచంలో అనేక దేశాలు ఈ విధానాన్ని రద్దు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించడం సబబుకాదని వ్యాఖ్యానించారు. అనంతరం బిల్లుపై సభలో వివిధ పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు. బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  
 
ఇక ఓటింగ్‌కు వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే సభ్యులు దూరంగా ఉన్నారు. అంతకుముందు జరిగిన చర్చలో బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నాటకీయంగా ఓటింగ్‌కు ముందు ఓ కాంగ్రెస్ ఎంపీ రాజీనామా చేయడం, దానిని చైర్మన్ ఆమోదించడం విశేషం. స్లిప్పుల ఆధారంగా ఓటింగ్ చేపట్టారు. 
 
చివరకు ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 99 మంది ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు రాలాయి. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది.