మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (13:36 IST)

నాలుక పీకుతోంది బాబూ, ఒక్క చుక్క: ఏపీలో మందుబాబులు చిందులు

అమరావతి : రాష్ట్రంలో క్రమంగా మద్యం కొరత ఏర్పడుతోంది. డిస్టిలరీల (ఉత్పత్తిదారులు)కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో అవి క్రమంగా మద్యం సరఫరాను తగ్గించాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి. డిమాండ్‌ ఉన్న లిక్కర్‌ ఉత్పత్తి చేసే డిస్టిలరీలు కూడా సరఫరా విషయంలో చేతులెత్తేశాయి. బకాయిలు ఇవ్వకుంటే ఉత్పత్తి తమ వల్ల కాదని, పెట్టుబడి పెట్టలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. దీంతో షాపుల్లో మద్యం కొరత ఏర్పడింది. 
 
మద్యం పంపాలని రోజూ డిపోల అధికారులు కోరుతున్నా డిస్టిలరీలు పట్టించుకోవడం లేదు. డబ్బులిస్తేనే ఉత్పత్తి చేయగలమని, ఉత్పత్తి ఖర్చులు కూడా తమ వద్ద లేవని వారు తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక, మద్యం కొరతను అధిగమించలేక ఎక్సైజ్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరు ఏ మద్యం సరఫరా చేసినా తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో మందు బాబులకు పెద్దగా ఆదరణ లేని, ఎప్పుడూ చూడని బ్రాండ్లే దిక్కవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారంలో షాపులన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది.
 
 
రూ.1700 కోట్లు చెల్లించాలి
గత ప్రభుత్వంలోనే డిస్టిలరీలకు బకాయిలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లించకపోగా ఇంకా పెంచారు. దీంతో ఇప్పుడవి రూ.1700 కోట్లకు చేరాయి. చివరగా సెప్టెంబరు 30న డిస్టిలరీలకు బిల్లులు చెల్లించారు. ఈ నెలలో ఒక్క రూపాయి కూడా వారికి విడుదల చేయలేదు. ఇప్పటికే పాత బకాయిలు ఉండటం, కొత్తవి కూడా ఆపడం వల్ల డిస్టిలరీలకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. డిస్టిలరీలు మద్యం ఉత్పత్తి చేసి సరఫరా చేస్తాయి. అయితే మద్యం ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో పాటు, డ్యూటీలు ముందుగా వారే కట్టాలి. 
 
మద్యం సరఫరాతో పాటు డ్యూటీలు కట్టి ఎక్సైజ్‌కు ఇస్తే, వాటిని అమ్మిన తర్వాత ఉత్పత్తి ధరను, డ్యూటీలను రీయింబర్స్‌ చేస్తారు. అంటే ఉత్పత్తితో పాటు డ్యూటీలు వారికి అదనపు భారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే పూర్తిగా సరఫరా ఆపేయడం తప్ప వేరే మార్గం లేదని డిస్టిలరీలు చెబుతున్నాయి. అలాగే సరఫరా చేసిన మద్యానికి సంబంధించిన లెక్కలు ఇంతవరకూ తేల్చకపోవడం డిస్టిలరీల్లో ఆందోళనను పెంచుతోంది. 
 
ఈ నెలలో సుమారు 22 లక్షల కేసుల మద్యాన్ని డిస్టిలరీలు సరఫరా చేశాయి. గతంలో ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చేవారు. కానీ ఈనెలలో ఇంతవరకూచెప్పలేదు. కొత్త సాఫ్ట్‌వేర్‌ గందరగోళం వల్ల లెక్కలు తేలడం లేదు. దీంతో తమ మద్యం ఏమైందోనని డిస్టిలరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లెక్కలు తేడా వస్తే నష్టం ఏర్పడుతుందని భయపడుతున్నాయి.