మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో బీజేపీతో పొత్తు కేవలం ఉహాగానాలే : బండి సంజయ్

bandi sanjay
ఈ యేడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీకి, వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతోంది. వీటికి మరింత ఊతమిచ్చేలా బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాలతో టీడీపీ చీఫ్ చంద్రబాబు భేటీ అయ్యారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఈ ప్రచారంపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాతో భాజపా పొత్తు ఉంటుందనేది ఊహాగానాలే అని అన్నారు. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తెదేపా అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. 
 
గతంలో మమత, స్టాలిన్‌, నీతీశ్‌ కూడా మోడీ, అమిత్‌షాను కలిశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలు, ప్రజలను కలవకుండా ఉండే పార్టీ భాజపా కాదని చెప్పారు. కేసీఆర్‌ మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ భాజపా కాదని సంజయ్‌ గుర్తుచేశారు.