మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (10:25 IST)

దుబ్బాకలో ఆసక్తికర పోరు : తెరాస వెనుకంజ.. బీజేపీ ముందంజ..

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆసక్తికరపోరు సాగుతోంది. ముఖ్యంగా, ఒక్కో రౌండ్ ముగిసే సమయానికి అధికార తెరాస అభ్యర్థి వెనుకబడిపోతుంటే, విపక్ష బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. 
 
ఇప్పటివరకు జరిగిన తొలి మూడు రౌండ్లలో బీజేపీ నేత రఘునందన్ రావుకు ఆధిక్యం వచ్చింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికర పోరుకు దుబ్బాక ఉప ఎన్నిక వేదికైంది. బీజేపీ ప్రస్తుతం లీడింగులో ఉంది. అనుకోని విజయం బీజేపీకి దక్కేలా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి రఘునందన్ రావు 1,250కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లలో మినహా ఇంతవరకూ జరిగిన కౌంటింగులో అధికార తెరాస పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి. టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతకు 7,964 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 9,223 ఓట్లు లభించాయి. 
 
అంతకుముందు తొలి రెండు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 615 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో ఆయనకు 3,208 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 2,867, కాంగ్రెస్‌కు 648 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్‌కు 1,282 ఓట్లు వచ్చాయి. 
 
సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,64,192 మంది ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు.