సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (13:44 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : రాజమౌళి - అలియాను నామినేట్ చేసిన చెర్రీ

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో ఆదివారంరోజున మెగాపవర్ స్టార్ రాంచరణ్ పాల్గొన్నారు. 'బాహుబలి' ప్రభాస్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రాంచరణ్ ఈ రోజు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, "ఈ సీజన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నా స్నేహితుడు ప్రభాస్ పొల్గొనడమేకాకుండా, నాకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది అని. నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ  భూమి మీద మనగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
 
ఈ సూక్ష్మాన్ని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్‌‌ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి, తన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.