సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (19:19 IST)

కోడిపుంజుకు బస్సు టిక్కెట్ - ప్రయాణికులే దేవుళ్లు అన్న ఎండీ సజ్జనార్

తెలంగాణ ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు కండెక్టర్ బస్సులో ఎక్కిన ప్రయాణికులతో పాటు ఓ ప్రయాణికుడు తన వెంట తెచ్చుకున్న కోడిపుంజుకు కూడా ప్రయాణ టిక్కెట్ కొట్టాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆ కండక్టర్‌తో పాటు టీఎస్ఆర్టీసీపై జోకులు పేల్చుతున్నారు. 
 
అయితే, రాజు అనే నెటిజన్ మాత్రం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తూ, కోడిపుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్ అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. దీనిపై ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ప్రయాణికులే దేవుళ్లు, వారి ఆదరాభిమానాలే మా సంస్థకు నిధి అని సమాధానిచ్చారు. అలాగే, టీఎస్ఆర్టీసీ కూడా ప్రగతి రథం - ప్రజా సేవా పథం అంటూ ట్వీట్ చేసింది. 
 
గోదావరిఖని బస్టాండు నుంచి మంగళవారం కరీంనగర్‌కు బయలుదేరిన ఓ బస్సులో మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు తన వెంట ఓ కోడిపుంజును కూడా తీసుకుని బస్సెక్కాడు. అయితే, ఆ బస్సు కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా టిక్కెట్ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రయాణికుడితో పాటు ప్రాణంతో ఉన్న జీవిని వెంట తీసుకుని వస్తే టిక్కెట్ తీసుకోవాలని బస్ కండక్టర్ సెలవించారు. దీంతో ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు.