ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:59 IST)

టెక్నాలజీలను అందిపుచ్చుకుంటే సామాన్యుల జీవితంలో మార్పులు: మంత్రి కే తారకరామారావు

ప్రస్తుతం ప్రపంచంలో దూసుకొస్తున్న నూతన టెక్నాలజీలతో సామాన్యుల జీవితంలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సగటు మానవుడి జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ, మెడికల్ అండ్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, గవర్నెన్సు, లా అండ్ ఆర్డర్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు నాస్కామ్ తో నిర్వహించిన  “ఎక్స్పీరియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అనే సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ తో ప్రత్యేకంగా “ఐటీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర- భారత దేశం చేపట్టాల్సిన చర్యలు” పేరుతో ఒక చర్చగొష్టిని నిర్వహించింది.

ఈ సందర్భంగా మంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అంశంలో దాని ఉపయోగాలు, తెలంగాణ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకుంటున్న తీరుపైన మంత్రి తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇదేవిధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ప్రత్యేకంగా 2020 సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించిందని, ఈ మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇన్ టెల్, త్రిబుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వంటి ప్రఖ్యాత సంస్థలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని తెలియజేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించి పెద్దఎత్తున డేటా అవసరమవుతుందని, డాటా వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తతో వ్యవహరిస్తున్నదని ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డాటా వినియోగం-వ్యక్తిగత గోప్యత అనే రెండు అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో డేటా వినియోగం పైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తన ఓపెన్ డాటా పాలసీ కింద వివిధ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమల మధ్య ఒక భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని, తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సంబంధించిన ప్రయోజనాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్ అనే ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి అన్నారు.

విత్తనాలు నాటే ప్రక్రియ నుంచి మార్కెట్లోకి పంటలను తీసుకువచ్చే వరకు ఉన్న అనేక అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందని విషయంపైన ఈ ప్రాజెక్టు ద్వారా రైతులను చైతన్య పరుస్తుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యా రంగంలోనూ అనేక ప్రయోజనాలకు కారణమయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
 
మంత్రి కే తారకరామారావు వ్యక్తపరిచిన అభిప్రాయాలతో నాస్కాకాం ఏకీభవించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి అభినందనలు తెలిపింది.

నాస్కామ్ ఇండియా ప్రెసిడెంట్ దేబ్ జానీఘోష్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పైన ప్రశంసలు కురిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి లోతైన అవగాహన ఉన్న రాజకీయ నాయకత్వం తెలంగాణకు ఉన్నదని, నాస్కామ్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా ఆమె మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాస్కామ్ రూపొందించిన సర్వే ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైన రూపొందించిన ఒక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.