బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (12:41 IST)

అనూహ్యంగా వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం కేసీఆర్

హుజురుబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫలితాల తర్వాత ఆయన వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. అలాగే, జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా వరంగల్ జిల్లా పర్యటన అనూహ్య పరిస్థితుల్లో రద్దయింది. 
 
బుధ, గురువారాల్లో సీఎం కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటిస్తారని సీఎంవో వర్గాలు కొద్దిరోజుల క్రితమే ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు ఆయన పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆ జిల్లాల ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సీఎం భావించారు. 
 
కేసీఆర్ తమ జిల్లాకు వస్తున్నారని ఎంతో ఆశగా చూసిన అధికారులు, టీఆర్ఎస్ నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. మంగళవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకునట్లు తెలుస్తోంది. 
 
కేసీఆర్ ఆ జిల్లాల పర్యటనకు మళ్లీ ఎప్పుడు వెళ్తారన్నది త్వరలోనే ప్రకటిస్తామని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ పర్యటన రద్దుగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది.