ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (13:11 IST)

ప్రశ్నిస్తే ఈడీ దాడులు.. రాజద్రోహం కేసులా: బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీతో దాడులు చేయించడమే కాకుండా రాజద్రోహం కేసులు నమోదు చేస్తారా అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలకు అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'మా హద్దులు మాకున్నయ్‌. సంజయ్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. మీ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్లం కాదు.. కేంద్రాన్ని వడ్లు కొనమంటే హద్దు మీరి మాట్లాడినట్లా!? మీరు చెప్పింది వింటూ.. లొంగి ఉంటే మంచోళ్లు.. దేశభక్తులా!? మీరు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపితే దేశ ద్రోహులు అయిపోతరా? ఇదేంటని ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేస్తరా!? అన్యాయంగా కేసులు పెడతారా?' అంటూ నిలదీశారు. 
 
అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసి తమను ఏదైనా చేద్దామని అనుకుంటే వాళ్లే నష్టపోతారని అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీకి వచ్చిన విరాళాలను; ఫాంహౌజ్‌ను, దానిలో ఇల్లు కట్టుకున్న విధానాన్ని గణాంకాలతో సహా వివరించారు. కేంద్ర చట్టాల ప్రకారమే తమకు నిధులు వస్తున్నాయని, వాళ్ల మాదిరిగా బ్లాక్‌ మెయిల్‌ చేసి తాము డబ్బులు తీసుకోమని చెప్పారు. 
 
అసలు కేంద్రం ధాన్యాన్ని కొంటుందా? కొనదా!? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం కొనమని చెబితే రైతులు ఆ పార్టీకి ఓటు వేయాలా? వద్దా అన్న విషయాన్ని నిర్ణయించుకుంటారు. వడ్లలోనే బీజేపోళ్ల కథ తేలుస్తాం. రైతుల ముందు మిమ్మల్ని పంచనామా చేస్తాం. కచ్చితంగా బ్లాస్ట్‌ చేస్తాం. 
 
అడ్డగోలుగా మాట్లాడి తప్పించుకుని పోతామంటే పోనివ్వం. మెడలు నువ్వు వంచుడు కాదు.. మేమే మీ మెడలు వంచుతాం. అడుగడుగునా నిలదీస్తాం. క్షుద్రమైన, నీచమైన మాటలతోపాటు వ్యక్తిగత, దిక్కుమాలిన నిందలకు ఎవడూ భయపడడు. తిప్పికొడతాం. గింగిరాలు తిరగాలి’’ అంటూ మండిపడ్డారు. 
 
పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తింటే తప్పా!? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. భాజాపా చేపల పులుసు తింటామని చెప్పారు. పత్తి లాభసాటి పంట అని పునరుద్ఘాటించారు. శనగలు, పెసర్లు, నువ్వులకు వరి కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. పత్తితోపాటు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పామాయిల్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. ఫసల్‌ బీమా అమల్లో కేంద్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని, ప్రధాని సొంత రాష్ట్రంలోనే దానికి దిక్కు లేదని విమర్శించారు. కేంద్రంపై తాము దాడి చేయడం లేదని, డిమాండ్లు పరిష్కరించాలని అడుగుతున్నామని చెప్పారు.