సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:29 IST)

"ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌-2020''గా భాగ్యనగరానికి మరో అరుదైన గౌరవం

భాగ్యనగరానికి మరో ఖ్యాతి విశ్వవ్యాపితమైంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నగరాల సరసన స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 51 నగరాల్లో హైదరాబాద్‌ నిలిచింది. నగరంలో మొక్కల పెంపకం, సంరక్షణ, ఆరోగ్యకర వాతావరణం.. ఈ మూడింటి ప్రాతిపదికన ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) కి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఏఫ్‌ఏఓ), అర్బర్‌ డే ఫౌండేషన్‌ హైదరాబాద్‌ నగరాన్ని "ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌-2020''గా ప్రకటించాయి.
 
ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల నుంచి 120 నగరాలను పరిగణనలోకి తీసుకోగా 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌' గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా, భారత్‌ నుంచి ఏకైక నగరం హైదరాబాద్‌ గుర్తింపు పొందడం విశేషం. 
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో కోట్లాది మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. నాలుగేళ్లలో మూడు కోట్ల మొక్కలు నాటే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2.77 కోట్లు నాటి 86% లక్ష్యం పూర్తయ్యింది. మియావాకి పద్ధతిన నగరంలోని 65 ప్రాంతాల్లో చిట్టడవులను పెంచుతున్నారు. 
 
హైదరాబాద్‌ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడంతో ఆరోగ్యకరమైన, సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి. 
 
ప్రపంచంలోని 63 దేశాల నుంచి 120 నగరాలను ఎఫ్‌ఏవో, అర్బర్‌ డే ఫౌండేషన్‌ పరిగణనలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికిగానూ 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌'గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుంచి ఏకైక నగరం హైదరాబాద్‌ ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌గా’ గుర్తింపు పొందడం విశేషం.