ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (09:47 IST)

కట్టుకున్నోడు నచ్చలేదు.. తాళికట్టిన గంటల్లోనే ప్రియుడితో లేచిపోయిన నవవధువు

కొంతమంది పెద్దలు తమ పిల్లలకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేస్తుంటారు. పిల్లల మనస్సులో ఏముందో తెలుసుకోకుండా వారిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా వివాహం చేస్తుంటారు. ఇలాంటి పెళ్లిళ్లు కొన్ని గంటలకే పెటాకులైపోతుంటాయి. అలాంటి పెళ్లి ఒకటి హైదరాబాద్ నగరంలో జరిగింది. వివాహమైన కొన్ని గంటల్లోనే కట్టుకున్న భర్తను వదిలివేసిన నవ వధువు.. తన ప్రియుడితో నగలు, డబ్బుతో లేచిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి (30)కి హైదరాబాద్, ఫలక్‌నుమా ప్రాంతంలోని  యువతి (20)తో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉండగా, వరుడి కుటుంబం అదే రోజు రావడంతో 17న సాయంత్రం బాలాపూర్ పరిధిలోని వధువు బంధువుల ఇంట్లో వివాహం జరిపించారు.
 
పెళ్లితంతు పూర్తికావడంతో వధువును తీసుకుని బెంగళూరు వెళ్లేందుకు వరుడి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మొహర్‌గా రూ.50 ఇప్పించాలని, ఆమెకు పెట్టాల్సిన నగలన్నీ అక్కడే ఆమెకు ఇవ్వాలని మధ్యవర్తి మౌల్వీ పట్టుబట్టాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు అలాగే చేశారు. అనంతరం వధువు తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పింది. ఇందుకు భర్త సహా ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో అన్న, వదినతో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.
 
బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆమె వారి కన్నుగప్పి అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆమె అన్నా, వదిన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత గంటకే వధువు తన అమ్మమ్మకు ఫోన్ చేసి భర్త తనకు నచ్చలేదని, కాబట్టి ప్రియుడితో వెళ్లిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. 
 
ఈ విషయం తెలియడంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. పథకం ప్రకారమే పెళ్లి చేసి డబ్బులు, నగలు ఇప్పించిన తర్వాత ప్రియుడితో పంపించి వేశారని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ డబ్బు, నగలు వెనక్కి ఇచ్చేస్తే వెళ్లిపోతామని పట్టుబట్టారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.