శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (11:00 IST)

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ - ఐటీ సోదాలు

ponguleti srinivasa reddy
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడా పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వేకువజామున మూడు గంటల నుంచి ఈ సోదాలు ఆరంభమయ్యాయి. ఖమ్మంలోని ఆయన నివాసంలో 3 గంటల నుంచి సోదాలు ప్రారంభించిన ఈడీ, ఐటీ అధికారులు మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చి, ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి ఆ కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న తరుణంలో ఇలా ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగడం కలకలం రేపుతుంది. 
 
కాగా, బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగొచ్చని ముందుగానే పసిగట్టారు. ఆ విధంగానే అధికారులు గురువారం వేకువజాము నుంచి సోదాలకు రావడం గమనార్హం. కాగా, తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంటూ అనేక ముందస్తు సర్వేలు ఢంకాబజాయించి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, ఐడీ అధికారులు సోదాలకు దిగడం గమనార్హం.