కేసీఆర్ విమర్శలకు ఈటల రాజేందర్ కౌంటర్
కేసీఆర్ పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి , హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. గురువారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో కేంద్రంపై సీఎం చేసి విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.కేసీఆర్ అనాలోచిత విధానాల కారణంగానే రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందన్నారు.
అన్నీ తనకు తెలుసుననే అహంకారపూరితంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.40 రోజులుగా రాష్ట్రంలో రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ఈటల రాజేందర్. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా ధాన్యం రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మొలకెత్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులకు వచ్చిన కష్టానికి కేసీఆర్ బాధ్యుడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ గొప్పలు చెప్పుకొన్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని అసెంబ్లీలో కూడా సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరిస్తుందనే విషయాన్ని ఏనాడూ కూడా కేసీఆర్ ప్రస్తావించలేదన్నారు. ధాన్యం కొనుగోలు కోసం గన్నీ బ్యాగుల నుండి ప్రతిదీ కేంద్రం చూసుకొంటుందన్నారు.