ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (13:38 IST)

నాగరాజు ఆత్మహత్య : పరువు కోసమా.. పైవారి కోసమా..???

తెలంగాణ రాష్ట్రంలో ఓ భూవివాదాన్ని పరిష్కరించే నిమిత్తం భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కీసర మండల కార్యాలయ తాహశీల్దారు నాగరాజు ఆత్మహత్య వెనుక కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. భారీ మొత్తంలో అంటే రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన విషయం తెల్సిందే.
 
ఏసీబీ విచారణలో మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోల పేర్లను నాగరాజు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసు విచారణ కీలక దశలో ఉండగా.. అండర్‌ ట్రయలర్‌గా చంచల్‌గూడ జైలులో ఉన్న నాగరాజు.. సెల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
తొలుత ఔట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధుల్లో చేరిన నాగరాజు.. 15 ఏళ్ల కాలంలో కొలువు పర్మినెంట్‌ చేయించుకుని.. పదోన్నతులతో తహశీల్దార్‌ స్థాయికి ఎదిగాడు. గిన్నిస్‌ రికార్డు స్థాయి లంచం కేసుతో అంతే వేగంగా దిగజారిపోయాడు.
 
ఒకసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఇప్పుడు భూవివాదం మెడకు చుట్టుకోవడంతో.. నామోషీగా భావించి ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. విచారణలో ఉన్నతాధికారుల పేర్లు చెప్పడంతో.. వారి పాత్ర గురించి పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అంతేకాకుండా.. అధికారంలో ఉండగా బినామీల పేరుతో ఆస్తి కూడబెడితే, కష్టకాలంలో చూడటానికి వారెవ్వరూ రాలేదనే వేదన కూడా నాగరాజు ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా జ్యుడీషియల్‌ రిమాండ్‌లో నాగరాజు మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం గమనార్హం. మొత్తంమీద తాహశీల్దారు నాగరాజు ఆత్మహత్య కేసు ఓ మిస్టరీగా మారిపోయే అవకాశం లేకపోలేదు.