శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (20:57 IST)

కిల్లర్ సంజయ్.. ఒక హత్య నుంచి తప్పించుకునేందుకు 9 హత్యలు...

తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ పట్టణ శివారు ప్రాంతంలోని ఓ పాడుబడిన బావిలో 9 మృతదేహాలు లభ్యమైన కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం ఒక హత్య నుంచి తప్పించుకునేందుకు ఓ హంతకుడు తొమ్మిది మందిని చంపేశాడు. అంటే ఈ హత్య కేసులకు సంబంధించి ఎలాంటి చిన్న ఆధారం కూడా లభించకుండా చేయాలన్నదే అతని పక్కా ప్లాన్‌లో భాగంగా మారింది. ఫలితంగానే ఒకే రోజు రాత్రి ఏకంగా 9 హత్యలు చేశాడు. ఈ క్రమంలో నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులు... సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టాడు. 
 
ఆ తర్వాత ఈ కేసు గురించి వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ మీడియాతో మాట్లాడుతూ... 'మక్సూద్ అనే వ్యక్తి ఫ్యామిలీ నాలుగైదేళ్ల కిందట కీర్తినగర్‌లో ఉండేది. వారు శాంతినగర్‌లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా అక్కడ వారికి సంజయ్ కుమార్ యాదవ్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకా (37) ఐదేళ్ల కిందట ముగ్గురు పిల్లలను తీసుకుని వరంగల్‌కు వచ్చింది. మక్సూద్ సాయంతో అక్కడే గోనె సంచుల కర్మాగారంలో పనికెళ్తూ, తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. 
 
ఇదే కంపెనీలో పని చేసే సంజయ్ కుమార్ యాదవ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సంజయ్‌కు కూడా వంట చేసిపెడుతూ వచ్చింది. ఇందుకోసం రఫీకాకు సంజయ్ కొంత డబ్బులు చెల్లించేవాడు. ఈ క్రమంలో రఫీకా - సంజయ్‌ల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఫలితంగా వారిద్దరూ మరో ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేయసాగారు. 
 
ఈ క్రమంలో రఫీకా పెద్ద కుమార్తె యుక్త వయస్సుకొచ్చింది. ఆ యువతితో సంజయ్ చనువుగా ఉండసాగాడు. దీన్ని రఫీకా జీర్ణించుకోలేకపోయింది. సంజయ్‌ను నిలదీసింది. పైగా, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగింది. దాంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించి పక్కాగా స్కెచ్ వేశాడు. 
 
ఈ స్కెచ్‌లో భాగంగా, పశ్చిమ బెంగాల్ వెళ్లి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మించి ఆమెతో కలిసి బెంగాల్‌కు వెళ్లేందుకు రైలెక్కాడు. రైల్లో మజ్జిగ ప్యాకెట్‌లో నిద్రమాత్రలు వేసి రఫీకాకు ఇచ్చాడు. ఆమె గాఢ నిద్రలోకని జారుకోవడంతో వేకువజామున 3 గంటల సమయంలో ఆమె మెడకు చున్నీతో ఉరి బిగించి చంపేశాడు. శవాన్ని రైల్లో నుంచి కిందికి తోసేశాడు. ఆపై ఏమీ ఎరగనివాడిలా రాజమండ్రిలో దిగిపోయి, మరుసటి రోజు వరంగల్‌కు చేరుకున్నాడు. 
 
అయితే, సంజయ్ మరుసటిరోజే వరంగల్‌కు ఒంటరిగా రావడాన్ని మక్సూద్ భార్య నిషా నిలదీసింది. నిజం చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంతలో షాబాజ్ పుట్టినరోజు రావడంతో తన ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఇందుకోసం ఓ మెడికల్ షాపులో భారీ మొత్తంలో నిద్రమాత్రలు కొనుగోలు చేసి వాటిని ఎవరికీ తెలియకుండా ఆహార పదార్థాల్లో కలిపేశాడు. తన హత్యలకు ఎవరూ సాక్షులుగా ఉండరాదని భావించి అదే భవనంలో ఉన్న ఇద్దరు బీహార్ కుర్రాళ్లను కూడా లేపేయాలని నిర్ణయించుకుని వాళ్ల ఆహారంలోనూ మాత్రలు కలిపాడు. ఈ పుట్టిన రోజు వేడుక కోసం బయటి నుంచి వచ్చిన షకీల్ అనే వ్యక్తి కూడా సంజయ్ ప్లాన్ ‌ బలయ్యాడు.
 
నిద్రమాత్రలు కలిపిన ఆహారం ఆరగించిన వారంతా మగతగా పడుకునిపోయారు. అలా ఒక్కొక్కరిని గోనె సంచిలో కుక్కి బావిలో వేశాడు. ఈ విధంగా తొమ్మిది మందిని బావిలో వేసి చంపేశాడనీ సీపీ వివరించారు. ఈ కేసులో హైదరాబాద్ నుంచి వచ్చి క్లూస్ టీమ్‌తో పాటు సీసీటీవీ ఫుటేజి ఎంతో సాయపడిందని, నిందితుడు సంజయ్ కుమార్ కదలికలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని ఆయన వివరించారు.