శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (16:45 IST)

తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తించనున్న ఎండలు - హస్తినలో 47 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపించనున్నాడు. ముఖ్యంగా, రానున్న ఐదు రోజుల్లో సూర్య తాపం మరింతగా ఉండనుందని భారత వాతావరణ సంస్థ ఐఎండీ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కుమార్ వెల్లడించారు. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతం, తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింత పెరగనున్నట్లు ఆయన తెలిపారు. మరో ఐదు రోజుల పాటు సూర్య ప్రతాపం తప్పదని.. 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను భానుడు మరింత భయపెడుతుండటం గమనార్హం.
 
ఇదిలావుండగా, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎండలు మండిపోతున్నాయి. మరికొన్నిరోజుల్లో రుతుపవనాల సీజన్ ప్రారంభం కాబోతుండగా సూర్యతాపం అదిరిపోతోంది. ఆదివారం ఢిల్లీలో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.
 
ఇప్పటికే వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వచ్చే వారం మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, పిల్లలు, వృద్ధులు బయటికి రావొద్దని అధికారులు సూచించారు. 
 
అటు, రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పశ్చిమ దిక్కు నుంచి వస్తున్న వేడి గాలులు, తీర ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.