నందమూరి సుహాసిని ఎంపిక వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి?
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అనూహ్యంగా నందమూరి హరికృష్ణ కుమారై సుహాసిని తెరమీద కొచ్చారు. హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దింపడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఎన్టీఆర్ కుటుంబంలోని ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టారనే వాదన బలంగా వినపడుతోంది. పురంధేశ్వరి మినహా ఎన్టీఆర్ కుటుంబమంతా ఏకతాటిపైనే ఉన్నారనే సంకేతాలను ఇవ్వడంతోపాటు హరికృష్ణను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉన్నామని భరోసా ఇచ్చినట్లయిందని తెలియజేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు.
సుహాసినిని కూకట్ పల్లి నుంచి బరిలోకి దింపడం ద్వారా గ్రేటర్ పరిధిలో స్థానాలపై ప్రభావం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో మహాకూటమి తరపున బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. సుహాసినిని రంగంలోకి దింపడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం మద్దతు కూడా ఉంటుందని టీడీపీ భావిస్తోంది. కూకట్‌పల్లి నుంచి టికెట్ ఆశించిన ఆశావాహులతో చంద్రబాబు సుహాసినికి మద్దతు ఇవ్వాలని, ఎన్టీఆర్ కుటుంబానికి టిక్కెట్టు ఇస్తున్నందున్న సహకరించాలన్న చంద్రబాబు నచ్చజెప్పినట్టు సమాచారం.
ఎన్టీఆర్ ఫ్యామిలీ వచ్చి అడగడంతో కాదనలేకపోయానని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అయితే సుహాసిని కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించడంతో హరికృష్ణ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిని నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో ప్రాతినిధ్యం వహించిన దాఖలాలు లేవు. అయితే ఆయన మనవరాలు సుహాసిని తెలంగాణ నుంచి రెండో సారి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇదిలా ఉంటే కూకట్ పల్లి టికెట్ ఆశించి భంగపడ్డ తిరమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి అలక వహించారు.