సింగర్ మధుప్రియ ప్రేమకథ సుఖాంతం.. సాయంత్రం వివాహం...
తెలంగాణ వర్థమాన గాయని మధుప్రియ వివాహం ఆమె అభీష్టం మేరకు వివాహం జరుగనుంది. అదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రియుడు శ్రీకాంత్‌తో ఈ పెళ్లి జరుగనుంది. ఈ వివాహానికి మధుప్రియ తల్లిదండ్రులు దూరంగా ఉండనుండగా, శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో ఈ వివాహం శుక్రవారం సాయంత్రం జరుగనుంది.
మధుప్రియ, శ్రీకాంత్‌ల మధ్య ప్రేమ గత రెండేళ్ళుగా సాగుతోంది. అయితే, నెల రోజుల క్రితమే మైనార్టీ (18 యేళ్ళు పూర్తయ్యాయి) తీరిన మధుప్రియ.. తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీనికి వారు ససేమిరా అన్నారు. పైగా.. గురువారం రాత్రి శ్రీకాంత్ ఇంటిపై దాడి చేశారు. దీంతో మధుప్రియ కాగజ్‌నగర్ పోలీసులను ఆశ్రయించి.. తన ప్రియుడితోనే వివాహం జరిపించాలని పట్టుబట్టారు. దీంతో కాగజ్‌నగర్ పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి ఈ విషయంపై చర్చించారు.
శ్రీకాంత్తో పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. అయితే శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడానికే ఆమె మొగ్గుచూపింది. ఆఖరుకు మధుప్రియ తల్లిదండ్రులు తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దీంతో మధుప్రియ ఇష్టప్రకారం శుక్రవారం సాయంత్రం ఆమె పెళ్లి జరగనుంది.