శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (16:03 IST)

ఆ కారణంతోనే తలసానికి రెండోసారి మంత్రి బాధ్యతలు...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో నలుగురు పాత మంత్రులకు మరోమారు ఛాన్స్ దక్కింది. వీరిలో సికింద్రాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకరు. ఈయన తన రాజకీయ చరిత్రలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు మంత్రిగా పని చేసిన తలసాని తెరాసలో చేరిన తర్వాత రెండోసారి మంత్రి అయ్యారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేయడంతో పాటు మరెన్నో పదవులను పొంది నగర మాస్‌లీడర్‌గా ముద్రగావించారు. 
 
ఈ నేపథ్యంలోనే తలసాని రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి మంత్రిగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ మంత్రి వర్గంలో గ్రేటర్ నుంచి హోంమంత్రిగా మహమూద్ అలీ ఉండగా తాజా మంత్రి వర్గ విస్తరణతో తలసానికి చోటు లభించడంతో మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. 
 
ఇకపోతే, తలసానికి రెండోసారి మంత్రిపదవిని కేటాయించడానికి కారణాలు లేకపోలేదు. అటు రాజకీయాల్లో ఇటు ప్రభుత్వ పాలనలో తలసాని తనదైన ముద్ర వేసిన నేతగా పేరుగడించారు. ఏ పదవికైనా వన్నె తెస్తూ రాజకీయాల్లో ఆదర్శనేతగా నిలిచారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతల్ని వమ్ము చేయకుండా అటు నగర తెరాస బలోపేతం పాటు ఇటు అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 
 
మత్స్య, పశు సంవర్థక శాఖ, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని తనదైన శైలిలో పాలన అందించారు. అంతకుముందు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్‌తో పాటు తలసాని కూడా తమవంతు బాధ్యతను పోషించారు. ఏ బాధ్యతలోనైనా సమర్థవంతంగా రాణించే సత్తా కలిగిన నాయకుడని గుర్తింపు ఉండడంతో సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో రెండోసారి మంత్రి వర్గంలో చోటు కల్పించడం గమనార్హం.