తెలంగాణ మంత్రివర్గం విస్తరణ : కొత్త మంత్రులు వీరే...
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం విస్తరించారు. ఈ మంత్రివర్గాన్ని పాత, కొత్త కలయికతో ఏర్పాటు చేశారు. ఈ తాజా మంత్రివర్గ విస్తరణలో మొత్తం పది మందికి ఆయన చోటు కల్పించారు. వీరిలో గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు కొత్తగా ఎస్ నిరంజన్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.
మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. కొత్త మంత్రులతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. అనంతరం వీరికి శాఖల కేటాయింపు ఉంటుంది. మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే కొత్త కేబినెట్‌ను ఎంపిక చేశారు.
రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్‌లో గరిష్టంగా 18 మంది మంత్రులు ఉండవచ్చు. ఇప్పటికే కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ హోంమంత్రిగా ఉన్నారు. తాజా విస్తరణలో చేరే 10 మందితో కలుపుకొని మంత్రుల సంఖ్య 12కు చేరుకుంటుంది. మిగిలిన ఖాళీలను లోక్‌సభ ఎన్నికల తరువాత భర్తీ చేసే అవకాశం ఉంది.