మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 25 మే 2016 (11:18 IST)

రాష్ట్రం వేరుబడినా ఈ ఆంధ్రా జడ్జీల గోలేంటి : న్యాయ మంత్రికి తెరాస నేతల ఫిర్యాదు

తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా తమ రాష్ట్రంలోని కోర్టుల్లో ఆంధ్రా జడ్జీలు ఇంకా కొనసాగుతుండటంపై తెరాస రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కింది కోర్టుల్లో ఆంధ్రా జడ్జీల గోల లేకుండా చేయాలని వారు కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడకు ఫిర్యాదు చేశారు. 
 
కింది కోర్టుల్లో న్యాయమూర్తులు సహా అధికారులు, సిబ్బంది విభజనలో తెలంగాణకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుందని, దీన్ని సరిదిద్దడానికి వెంటనే చొరవ తీసుకోవాలని సదానందకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్ సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 
 
హైకోర్టు నిబంధనల ప్రకా రం 60:40 నిష్పత్తిలో ఉద్యోగుల కేటాయింపు ఉండాలని, అయితే దీన్ని బుట్టదాఖలు చేయడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. కింది కోర్టుల్లో తెలంగాణకు జరిగిన కేటాయింపుల్లో మొత్తం 95 జడ్జీల పోస్టుల్లో 46మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు. 
 
ఉమ్మడి హైకోర్టులో వివిధ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది పోస్టుల్లో పనిచేస్తున్న 197మందిలో 48మందే తెలంగాణవారన్నారు. ఈ విధంగా చూస్తే న్యాయమూర్తి మొదలు కిందికోర్టుల్లో జడ్జీలు, సిబ్బందివరకు తెలంగాణ ఇంకా త్యాగాలు చేస్తూ అన్యాయానికి గురవుతూనే ఉన్నదని మంత్రికి వివరించారు.