మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (11:43 IST)

వైద్యులు చేతులెత్తేశారు.. తాయత్తు కట్టుకోవడం వల్లే బతికాను...

తెలంగాణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు వైద్యులు, వైద్య వృత్తిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. తాను చిన్నపుడు ప్రాణాపాయస్థితిలో ఉండగా, డాక్టర్లు చేతులెత్తేశారని అన్నారు. అపుడు తన తాత పక్కనున్న మసీదులో తాయత్తు కట్టించాడని, ఆ తాయత్తు మహిమ వల్లే తాను బతికి బయటపడినట్టు శ్రీనివాస రావు అన్నారు. ఒక స్టేట్ హెల్త్ డైరెక్టరుగా ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
తాజా వివాదం వివరాల్లోకి వెళితే... కొత్తగూడెంలో ముస్లింలకు ఆయన తన జీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన బాల్యంతో ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు వైద్యులు చేతులెత్తేశారని, అపుడు తన తాత, అమ్మమ్మలు దగ్గర్లోని మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని, ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
 
ఒక హెల్త్ డైరెక్టరుగా ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు, రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవలికాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. గతంలో కూడా జీసెస్ వల్లే కరోనా పోయిందంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇపుడు అలాంటి వ్యాఖ్యలనే ఆయన మరోమారు చేయడం గమనార్హం.