సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (09:21 IST)

ఆన్‌లైన్‌లో రూ.8 లక్షలు పొగొట్టుకున్న మహిళ.. పిల్లలతో సంపులో దూకి ఆత్మహత్య

online gaming
ఆన్‌లైన్ వ్యసనం డబ్బులతో పాటు ప్రాణాలును కూడా తీస్తున్నాయి. తాజాగా ఓ మహిళ ఆన్‌‍లైన్‌ ఆటల్లో ఏకంగా రూ.8 లక్షల మేరకు పోగొట్టుకుంది. దీంతో ఏం చేయాలో దిక్కుతెలియక తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వలిగొండ మండలం గొన్నేపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన అవిశెట్టి మల్లేశ్ అనే వ్యక్తి ఓ లారీ డ్రైవర్. ఈయన భార్య రాజేశ్వరి (28). వీరికి అనిరుధ్ (5), వర్షవర్ధన్ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చౌటుప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో ఉంటున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉన్న రాజేశ్వరికి... ఈ క్రీడలకు బానిసైంది. దీంతో తన కుటుంబ సభ్యులతో పాటు బంధువుల వద్ద అప్పు తెచ్చి ఆన్‌లైన్ రమ్మీ వంటి క్రీడలు ఆడింది. ఇందులో రూ.8 లక్షల మేరకు పోగొట్టుకుంది. పైగా, అప్పు ఇచ్చినవారు కూడా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని రాజేశ్వరి.. స్థలం విక్రయించి ఇస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు. 
 
ఆ సమయంలో ఇంటిలోనే ఉన్న భర్త.. వేరే పనిమీద బయటకు వెళ్లాడు. డబ్బులు కోసం వచ్చిన ఓ వ్యక్తి ఇంటిలో కొద్దిసేపు వుండి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి.. ఇంటి ఆవరణంలోనే ఉన్న సంపులో తన ఇద్దరు కుమారులను పడేసి.. తాను కూడా దూకి ప్రాణాలు తీసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన భర్త మల్లేశ్.. భార్యాపిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. 
 
అదేసమయంలో సంపు మూతతీసి వుండటాన్ని గమనించి.. అందులో చూడగా లోపల ముగ్గురు కనిపించారు. వెంటనే వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వారంతా అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.