'ఇండియన్-2'కు కష్టాల పరంపర... షూటింగ్ నిలిపివేతపై నిర్మాత ఆలోచన!?
శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ "ఇండియన్-2". గత 1996లో వచ్చిన 'భారతీయుడు' మూవీకి ఇది సీక్వెల్. ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. కమల్, కాజల్ ప్రధాన పాత్రలలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే, ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అంతరాయం తగులుతూనే వుంది. 'ఇండియన్ 2' చిత్ర షూటింగ్ మొదలైనప్పుడు ఏవో కారణాల వలన కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కమల్ కాలు ఆపరేషన్ సమయంలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది.
ఆ ప్రమాదం నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయడం జరిగింది. ఇలా ప్రతీసారి సినిమాకి అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును నిలిపివేస్త మంచిదన్న ఆలోచనలో నిర్మాత సుభాస్కరన్ ఉన్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం.