శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (15:41 IST)

'మా' బ‌రిలో మ‌రో న‌టుడు.. ఆయన ఎవరంటే..?

CVL
మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న‌ట్లు మంచు విష్ణు ఆదివారం అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు లేఖ రాశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని తెలిపారు. 
 
పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకు బాగా తెలుసని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మా ఇంటిని మనమే చక్కదిద్దుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే వ్యయంలో 25 శాతం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో రోజురోజుకు ‘మా’ ఎన్నిక‌లు స‌వ‌త్త‌రంగా మారుత‌ున్నాయి. అధ్య‌క్ష బ‌రిలో మ‌రో న‌టుడు దిగాడు. సార‌థ్య బాధ్య‌త‌లు మోసేందుకు తాము కూడా సిద్ధమంటూ రోజుకో ఆర్టిస్ట్ ముందుకొస్తున్నారు. తాజాగా మరో అభ్యర్థి పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు, హేమ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా ‘మా’ అధ్య‌క్ష‌ ఎన్నికల బరిలో నిలిచారు. 
 
తనకు ఎలాంటి ప్యానల్ లేదని, అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సీవీఎల్ తెలిపారు. ప్రస్తుత వివాదాల వల్ల తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతుందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ వాదంతో ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 
 
‘మా’ అసోసియేషన్ విభజన జరగాలని డిమాండ్ చేశారు. 18 మంది కార్యవర్గ సభ్యుల్లో 9 మంది తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు. సీవీఎల్ ప్రకటనతో మా అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఐదుగురు అభ్యురులు బరిలో నిలిచిన‌ట్లైంది.