మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం.. మంచు విష్ణు లేఖ
తెలుగు సినిమా నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మా ఎన్నికల హీట్ టాలీవుడ్‌లో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఇదే విషయమై ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందించగా.. లేటెస్ట్‌గా తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ రాశారు.
నామినేషన్ వేయబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ లేఖను MAA సభ్యులకు.. నా MAA కుటుంబానికి.. అంటూ లేఖను రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకి బాగా తెలుసని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.
"ఈ ఏడాది జరగనున్న మా అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు మా కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను"
నా తండ్రి మోహన్‌బాబు మా అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలయ్యాయి. గతంలో మా అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు మా బిల్డింగ్ ఫండ్‌కి నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25శాతం అందిస్తానని మాట ఇచ్చాను.
భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి మా కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను. మా వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా, జాగ్రత్తగా పరిశీలించిన నాకు మా కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది.
మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. అందుబాటులో ఉంటాం. మా అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నా" అని మంచు విష్ణు పేర్కొన్నారు.