హేమ రాకతో వేడెక్కిన `మా` ఎన్నికలు
మా ఎన్నికలు (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రతిసారీ రాజకీయపార్టీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అందులో సభ్యులు 465మంది మాత్రమే. కానీ పోటీకి ఇప్పుడు నలుగురు రంగంలోకి దిగారు. ముందుగా ప్రకాష్‌రాజ్ పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత మోహన్‌బాబు చక్రం తిప్పి మంచు విష్ణును ప్రవేశపెట్టాడు. ఇక మంగళవారంనాడు అనూహ్యంగా జీవిత రాజశేఖర్ ముందుకు వచ్చింది. ఇక బుధవారంనాడు నటి హేమ రంగంలో వుంటున్నట్లు తాజా సమాచారం.
కరోనా టైంలో అందరూ జీవిత పాఠాలు చెప్పిన వారంతా ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నువ్వా? నేనా? అంటూ ఎన్నికల బరిలో దిగుతున్నారు. హేమ విషయానికి వస్తే గత ఎన్నికల్లోనూ ఆమె వాయిస్ పెద్దగా వినిపించింది. ఆమె ఏం చెప్పినా అది కరెక్టే అనిపించేలా మాటలు చెబుతుండేది. మా లో జరిగే అన్ని విషయాలు ఆమెకు క్షుణ్ణంగా తెలుసు. ఇక జీవితాకు మా గురించి పూర్తిగా తెలీదు. ఇక ప్రకాష్‌రాజ్ పరిస్థితి కూడా అంతే. విష్ణు పరిస్థితి తెలిసింది ఏదో ఒకటి చేయాలని అంటున్నాడు. వీరి పోటీపై మా సభ్యులందరూ చోద్యం చూడ్డంమినహా చేసేది ఏమీలేదు.
వర్గాల వారీగా ఓటింగ్
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక వర్గానికి చెందిన సాలిడ్ ఓటింగ్ 95మంది సభ్యులు తమ వర్గానికి చెందిన ఎవరు నిలబడినా కళ్ళుమూసుకుని ఓటేస్తాడు. మిగిలిన వర్గాలలోని కొందరిని తమవైపు సినిమాలో వేషాలు ఇప్పిస్తామంటూ వారు హామీ ఇచ్చి తమవైపు లాక్కుంటారు. అప్పుడు అందరూ మాట వినకపోతే సీనియర్ సభ్యుల్ని ఫించన్ రూపంలో చేయూత ఇస్తామని హామీ ఇస్తారు. ఇలా ప్రతిసారీ ఎన్నికల్లో జరిగే తంతే. ఈసారి మరి ఎలా జరుగుతందో ఆసక్తికరంగా మారిందంటూ కొందరు సభ్యులు చెప్పుకోవడం విశేషం.