మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (18:09 IST)

బాలీవుడ్ ముంబైకే పరిమితం.. కానీ, టాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది : నిర్మాత నాగవంశీ

nagavamsi
హిందీ చిత్రాలు కేవలం ముంబైకే పరిమితమయ్యాయని, కానీ, తెలుగు చిత్రాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని టాలీవుడ్ నిర్మాత నాగవంశీ అన్నారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా మూవీస్ అనే అంశంపై జరిగిన చర్చలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నాగవంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నిర్మాతల రౌండ్ టేబుల్ సదస్సులో ఈ ఇద్దరు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ముందుగా బోనీ కపూర్ మాట్లాడుతూ, 'దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్‌ బాగుంటుంది' అని అన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఉంటుందని నాగవంశీ అన్నారు. 
 
ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల గురించి మాట్లాడుతూ, 'సౌతిండియా ఫిల్మ్‌ మేకర్స్‌, యాక్టర్స్‌ బాలీవుడ్‌పై ప్రభావం చూపారు. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పుష్ప-2' వంటి చిత్రాలతో మార్పు చూసి ఉంటారు. 'యానిమల్‌', 'జవాన్‌' సినిమాలు దక్షిణాది దర్శకులు తెరకెక్కించినవే. హిందీ చిత్ర పరిశ్రమ ముంబైకే పరిమితమైంది' అని కామెంట్‌ చేయగా బోనీ కపూర్‌ దాన్ని అంగీకరించలేదు. 
 
ఆ తర్వాత బోనీ కపూర్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ్‌, హిందీ.. ఇలా ఏ భాషలో తెరకెక్కినా ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే మంచి సినిమా అని నేను నమ్ముతా. ఈరోజుల్లో మరాఠీ చిత్రాలు సైతం రూ.100 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి' అని వ్యాఖ్యానించారు.