ప్రతి భారతీయుడు గర్వించదగిన తరుణం : "నాటు నాటు"కు ఆస్కార్‌పై చిరు స్పందన
ఆస్కార్ వేదికపై తెలుగోడు సత్తా చాటాడు. "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ ఉప్పొంగిపోతుంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సోమవారం సాగుతోంది. ఇందులో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని "నాటునాటు" పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గ్రామీ అవార్డు వరించింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన సమయమన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక అభినందనలు తెలుతున్నట్టు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
"ఇదొక చారిత్రాత్మకమైన విజయం. భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయం. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, తారక్, చరణ్, పాటపాడిన సిప్లిగంజ్, కాలభైరవలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. మనకు ఇంతటి కీర్తిని తీసుకొచ్చిన విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా అభినందలు తెలుపుకుంటున్నాను" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
అలాగే, తన కుమారుడు చరణ్ గురించి మాట్లాడుతూ, బిడ్డ ఎదుగుతుంటే ఏ తండ్రికైనా ఆనందంగానే ఉంటుందన్నారు. గతంలో ఉత్తరాది వాళ్ళకు తెలుగు చిత్రం అంటే ఏంటో తెలియదన్నారు. మనల్ని మదరాసీలు అనేవారనీ, ఆ స్థాయి నుంచి "శంకరాభరణం" తదితర ఎన్నో చిత్రాల ద్వారా మన తెలుగు సినిమా గుర్తింపు తెచ్చుకుంటూ వచ్చిందన్నారు.
ఆస్కార్ అవార్డు జడ్జిమెంట్ చాలా బాగుందన్నారు. 'నాటు నాటు'కు అవార్డు వస్తుందని ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ ఏదో మూల చిన్న అనుమానం ఉండేదని, ఇపుడు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆస్కార్ పొందడానికి ఈ పాట అన్ని విధాలా అర్హత కలిగి ఉందని, పాటకు అవార్డు ఇవ్వడంతో ఆస్కార్‌కు ఆస్కారం ఉందనిపించిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని విజయాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.