సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (10:31 IST)

వడదెబ్బకు "సైరా" చిత్ర జూనియర్ ఆర్టిస్ట్ మృతి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. 
 
ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు సెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతోనే సినిమా చిత్రీకరణ ఆలస్యం అయిందని భావిస్తున్న వేళ, తాజాగా, రష్యాకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ మృతిచెందాడు. 
 
టూరిస్ట్ వీసాపై మార్చిలో హైదరాబాద్ కు వచ్చి, 'సైరా'లో ఓ పాత్రను పోషిస్తున్న అలెగ్జాండర్ (38) అనే వ్యక్తి గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నెంబర్‌-1 వద్ద అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎండ వేడిమిని తాళలేక (వడదెబ్బ) ఆయన పడిపోగా, పోలీసులు తొలుత కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి, ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
 
అతని కెమెరాలోని చిత్రాల ఆధారంగా, 4, 5 తేదీల్లో సైరా సినిమాలో నటించాడని, గచ్చిబౌలి సమీపంలోని ఓ హోటల్‌‌లో నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. వడదెబ్బ కారణంగానే అలెగ్జాండర్‌ మృతి చెందాడని, గోవాలో ఉన్న అతని స్నేహితునికి సమాచారం ఇచ్చామని, అతను వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.