చిరు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన మెగా ఫ్యాన్... రంగంలోకి దిగిన చిరు టీమ్..!
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నామని సీఈఓ జె శ్రీనివాసరావు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు ప్రప్రథమంగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్‌ను అన్ని సదుపాయాలతో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. దీంతో చిరంజీవి విద్యారంగంలోకి ప్రవేశిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే... చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట స్ధాపించిన సంస్థకు చిరంజీవి గారికి గానీ, చరణ్ గారికి గానీ, నాగబాబు గారికి గానీ ఎటువంటి సంబంధం లేదు. చిరంజీవి గారి అభిమానులమైన మేము సేవా థృక్పథంతో, సామాజిక స్పృహతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట సంస్థను స్ధాపించి దిగువ తరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో విద్యను అందించాలనే ధృడ సంకల్పంతో ఈ సంస్థను స్ధాపించడం జరిగింది.
మెగా కుటుంబం మీద ఉన్న అభిమానంతో చిరంజీవి గారిని, చరణ్ గారిని నాగబాబు గారిని గౌరవ ఫౌండర్‌గా, గౌరవ అధ్యక్షులుగా గౌరవ ఛైర్మెన్‌గా మంచి ఉద్దేశ్యంతో మేము నియమించుకోవడం జరిగింది. కావున దయవుంచి మెగా స్నేహితులందరు ఈ సంస్థకు చిరంజీవి గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని గమనించగలరు. అదేవిధంగా ఈ మా చిరు ప్రయత్నాన్ని ముందుకు నడిపించి పేద ప్రజలకు విద్యను ఉచితంగా అందుబాటులోకి తేవడానికి మీరు కూడా సహకరిస్తారని కొండంత అభిమానంతో మీ మెగా మిత్రుడు జె.శ్రీనివాసరావు అంటూ సంస్థ సీఈఓ లేఖ ద్వారా తెలియచేసారు.