చిత్రపురి కళాకారులకు అండగా నిలబడతా : పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నగరంలోని చిత్రపురిలో ఇళ్లు దక్కని చిత్ర కళాకారులకు తాను అండగా నిలుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, చిత్రపురిలో ఇల్లు దక్కని కళాకారుల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేవిధంగా ముందుకు వెళతామన్నారు. ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఎన్.శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజలతో తాను స్వయంగా మాట్లాడుతానని చెప్పారు.
ఇదిలావుండగా, హైదరాబాద్‌లోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను చిత్రపురి సాధన సమితి సభ్యులు కలిసి తమ సమస్యలను వివరించారు. చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లో తాము పనిచేస్తున్నామనీ, కానీ చిత్రపురిలో ఇతరులకు ప్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఈ విషయమై పోరాడినా న్యాయం జరగలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారికి పని దొరక్కుండా చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న జనసేనాని.. చిత్రపురిలో తెలుగుసినిమా వారి ఇంటి కల నెరవేరాల్సిన అవసరముందన్నారు. ఈ విషయమై చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ఇతరులతో మాట్లాడుతామనీ, జనసేన పార్టీ ఆర్టిస్టులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.