శుక్రవారం, 28 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (17:44 IST)

ఏపీ సీఎం కావాలంటే బీజేపీలో చేరాలి : అన్నం సతీశ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలని, ఈ లక్ష్యం నెరవేరాలంటే ఆయన బీజేపీలో చేరాలని బీజేపీ నేత అన్నం సతీశ్ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ వచ్చే జనవరి నెలలోగా బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. 
 
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వస్తారని... ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారన్నారు. పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందన్నారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని... ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అన్నం సతీశ్... ఈ మధ్యనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 
 
మరోవైపు, నవ్యాంధ్ర అమరావతి నిర్మాణం విషయంలో వైకాపాలోని ప్రభుత్వం వెనుకడుగు వేస్తే అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అన్నం సతీశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.