గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (14:25 IST)

దాస్‌ కా ధమ్కీ ఎలా వుందంటే రివ్యూ రిపోర్ట్‌

viswk, nivetha
viswk, nivetha
నటీనటులు: విశ్వక్ సేన్, నివేతా పెత్తురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, అక్షర గౌడ, శౌర్య కరే, జబర్దస్త్ మహేష్
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, సంగీత దర్శకులు: లియోన్ జేమ్స్, ఎడిటర్: అన్వర్ అలీ, దర్శకుడు : విశ్వక్ సేన్, నిర్మాత: కరాటే రాజు 
 
ఫలక్‌నామ్‌దాస్‌ చిత్రంతో నిర్మాతగానూ హీరోగానూ దర్శకుడిగానూ చేసిన విశ్వక్‌సేన్‌ ఈసారి దాస్‌ కా ధమ్కీ చిత్రాన్ని చేశాడు. అయితే ఇందులో డ్యూయల్‌ రోల్‌. పేదవాడు, ఉన్నవాడు. ఇలాంటి పాత్రలతో గతంలో పలు సినిమాలు వచ్చాయి. సినిమా విడుదల ముందునుంచి తెగ ప్రచారం చేసిన విశ్వక్‌ సేన్‌ సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ సినిమాకు హైలైట్‌ అని చెప్పాడు. మరి ఆయన చెప్పింది నిజమేనా? ఈరోజే విడుదలైన సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
కృష్ణ దాస్‌ (విశ్వక్‌సేన్‌) స్టార్‌ హోటల్‌లో వెయిటర్‌. అతనితోపాటు మహేష్‌, హైపర్‌ ఆది కూడా సర్వర్లే. ఓసారి కస్టమర్‌కు చేసిన సర్వీస్‌ చెత్తగా వుండడంతో ఫ్లాట్‌ఫామ్‌ గాళ్ళు వెయిటర్‌ అయితే ఇలా వుంటుందని ఎద్దేవా చేస్తుంది. అప్పటినుంచి అతనిలో వున్న ఇగో హర్ట్‌ అయి ఈ హోటల్‌ను కొనేస్తానంటూ ఫ్రెండ్స్‌ దగ్గర ఆవేశంలో చెప్పేస్తాడు. ఇదిలావుండగా, ఎస్‌.ఆర్‌. ఫార్మా ఛైర్మన్‌ సంజయ్‌ రుద్ర అచ్చు దాస్‌లా వుండడంతో రుద్ర బాబాయ్‌ రావురమేష్‌ చనిపోయిన రుద్ర ప్లేస్‌లో దాస్‌ను పెడతాడు. 10వేల కోట్ల ఫార్మాడీల్‌ అతనితో చేయాలనుకుంటాడు. మరి అది నెరవేరిందా? నివేత పాత్ర ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
విశ్లేషణ:
పోలిన మనిషి ప్లేస్‌లో పేదవాడు ఉన్నవాడి ప్లేస్‌లో వెళ్ళడం అనేది ఎన్‌.టి.ఆర్‌. నుంచి గోపీచంద్‌ వరకు చాలా కథలు వచ్చేశాయి. కానీ నేపథ్యాలు వేరు. ఈ దాస్‌ కా దమ్కీలో ఫార్మా కంపెనీ చైర్మన్‌కూ వెయిటర్‌కూ లింక్‌ పెట్టి కథను తయారు చేసుకున్నారు. కొన్నిచోట్ల ట్విస్ట్‌లు వున్నట్లు అనిపించినా అంతర్లీనంగా కథలో విలన్‌ ఎవరనేది తెలిసిపోతుంది. 
 
ఇక రెండు పాత్రలలో విశ్వక్‌ సేన్‌ సరిగ్గా సరిపోయాడు. తనలోని నటనా చాతుర్యాన్ని ఇందులో కనబరిచాడు. దర్శకుడిగా రాణించాడు. అయితే కథలో ఏమంత కొత్తదనం లేకపోవడంతో సాహసం చేశాడనే చెప్పాలి. ఫైనల్‌గా వచ్చేసరికి అందరూ ఇందులో పెద్ద నటులే. ఒరకినొకరు మోసం చేసుకునే వాళ్ళే. వారందరికీ సినిమాటిక్‌గా విశ్వక్‌ సేన్‌ ఎలా చెక్‌ పెట్డాడనేది ఈ సినిమా.
 
మొదటిభాగమంతా చాలా సరదాగా సినిమాలాజిక్‌తో మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేవిధంగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో వచ్చేది చాలా కీలకం అని మొదటినుంచి చెబుతున్నా సినిమా చూశాక అంతగా ఇందులో ఏమీ లేదనిపిస్తుంది. ఇక పలు మలుపులు కథలో వున్నాయనుకున్నా అవి కూడా అంతగా ఆకట్టుకోవు. జైలు ఎపిసోడ్‌లో కొత్త ప్రయోగం చేసి బయటకురావడం వంటివి ఎక్కడో జరిగిన సంఘటనను కథలో మలిచినట్లయింది. దీనికి సీక్వెల్‌గా వుంటుందని క్లయిమాక్స్‌లో చెప్పాడు. ఈ సినిమా ఆదరణబట్టే ఆ సినిమా ఆధారపడి వుంటుంది. ఇప్పటికే ఉన్న డబ్బులన్నీ సినిమాకే పెట్టేశానన్న విశ్వక్‌ సేన్‌ తండ్రి కరాటే రాజు మాటలు ఈ సినిమా సక్సెస్‌పైనే తదుపరి సినిమా  ఉంటుందనిపిస్తుంది.
 
సంగీతపరంగా లియోన్‌ జేమ్స్‌ బాగానే చేశాడు. దినేష్‌ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సంభాషణపరంగా సుధాకర్‌ బెజవాడ డైలాగ్స్‌ ఓకే అనిపిస్తాయి. మిగిలిన పాత్రలు వారి వారి పరిధిమేరకు నటించాయి. మొత్తంగా చూస్తే ఇది మాస్‌ ప్రేక్షకులను అలరించే సినిమా. ఉగాదికి సరదాగా చూసే సినిమా. ఎటువంటి అంచనాలు లేకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది.