ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 25 జులై 2017 (09:57 IST)

మూడు రోజుల్లో 25 కోట్లు.. లాభం 10 కోట్లు.. దిల్ రాజు పంట పడించిన 'ఫిదా' సాయి పల్లవి

బాహుబలి 2 సినిమా తొలిరోజు కలెక్ష్లన్లు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. కాని ఫిదా సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్లు మన దేశంలోనూ, యుఎస్‌లోనూ కలిపి 25

బాహుబలి 2 సినిమా తొలిరోజు కలెక్ష్లన్లు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. కాని ఫిదా సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్లు మన దేశంలోనూ, యుఎస్‌లోనూ కలిపి 25 కోట్లు దాటింది. కానీ ఒక చిన్న సినిమా... కేవలం కథను నమ్ముకుని తీసిన లోబడ్జెట్ సినిమా మూడు రోజుల్లో 25 కోట్లు సాధించడం ఆంటే ఇది బాహుబలికి ఏమాత్రం తీసిపోదని విశ్లేషకులు అంటున్నారు. ఎంతలా అంటే మూడు రోజుల్లో ఫిదా సినిమా నిర్మాణ ఖర్చులు (15 కోట్లు)  వచ్చేయడమే కాదు. పది కోట్లకు పైగా లాభాల బాట పట్టటం టాలివుడ్ ప్రముఖులకు షాక్ తెప్పిస్తోంది. 
 
సినీ వ్యాపార విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం తొలివారాంతం ముగిసేసరికి ఫిదా సినిమా 25 కోట్ల రూపాయల కలెక్షన్లను దాటేసింది ఒక ఎన్నారై అబ్బాయి, ఒక తెలంగాణ అమ్మాయి మధ్య ప్రేమ కథ అధారంగా శేఖర కమ్ముల తీసిన ఈ సినిమా ఆయన దర్శకత్వ కెరీర్లోనే అతిపెద్ద హిట్ సాధించడం విశేషం. అలాగే హీరో వరుణ్ తేజ్ కెరీల్లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమా కూడా ఫిదాయే.
 
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు బాక్సాఫీసు వద్ద తేలిపోవడంతో మూడేళ్లుగా మౌనం వహించిన శేఖర కమ్ముల మంచి కథ దొరకగానే గోడకు కొట్టిన బంతిలా వచ్చేశాడు. మంచి సినిమాల దర్శకుడిగా తనమీద పడిన ముద్రను హిట్ సినిమాల దర్శకుడిగా శేఖర్ కమ్ముల ఒక్క ఫిదాతో తొలగించుకున్నాడు. ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక హీరో ముగ్గురి కెరీర్లను ఒక్క సారిగా ముందుకు తీసుకుపోయిన ఘనత మాత్రం సాయిపల్లవికే దక్కుతుంది. 
 
తెలంగాణ పిల్లగా సాయిపల్లవి నటన ప్రేక్షకుల్లోనూ, సినీ విమర్శకుల్లోనూ అద్భుతాన్ని సృష్టించింది. కేవలం ఆమెను చూడటానికే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా థియేటర్లకు వస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. సినిమాకు ప్రాణం పోసింది సాయిపల్లవి నటనే అని చెప్పవచ్చు. 
 
చివరకి తెలంగాణ అంటేనే ప్రాణం పోసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయన కుటుంబం మొత్తానికి ప్రత్యేకంగా సినిమా వేయించుకని చూసారంటే తెలంగాణ సమాజంపై, ప్రజలపై, రాజకీయనేతల్లో కూడా ఈ సినిమా ఎంత గొప్ప ప్రభావం వేసిందో అర్థమవుతుంది. 
 
ఇక అమెరికాలో అయితే తొలి వారంతంలోపే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ఫిదా చరిత్రకెక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే సాయి పల్లవి దిల్ రాజు పంట పండించింది.

ఇక్కడ సాయి పల్లవి చిత్రవిజయంలో గణనీయ పాత్ర పోషించిందంటే వరుణ్ తేజ్ పాత్రను కానీ, మెెగా స్టార్ అభిమానుల పాత్రను కాని కించిపర్చినట్లు, చిన్నబుచ్చినట్లుకాదు. వీరి దన్ను, సపోర్టు చిత్ర విజయానికి ఎంత దోహదపడిందో అంతే స్థాయిలో తెలంగాణ అమ్మాయిలా సాయి పల్లవి ప్రదర్సించిన హావభావాలు, కనిపించిన పరిణతి తెలంగాణ సమాజాన్ని, ప్రజలను కట్టిపడేసింది  అన్నది కూడా అంతే వాస్తవం. 

చివరకు వరుణ్ తేజ్ సైతం ప్రేక్షకులు నాకంటే సాయిపల్లవినే ఎక్కువగా లైక్ చేస్తున్నారు. నా డైలాగుల కంటే ఆమె డైలాగులకే ఎక్కువ స్పందిస్తున్నారని మీడియాకు చెప్పాడు. తోటి నటి మంచి గుర్తింపు పొందినందుకు సంతోషం వ్యక్తం చేయడం వరుణ్ తేజ్ సంస్కారం. హీరోయిన్  హీరోను డామినేట్ చేయడం అనే భావననే తెలుగు చిత్రపరిశ్రమలో ఏ హీరో కూడా ఒప్పుకోడన్నది సత్యం. ఇక్కడే వరుణ్ తేజ్ గొ్ప్పతనం అర్థమవుతుంది. తన పాత్ర కంటే సాయి పల్లవి పాత్రను బాగా ఎలివేట్ చేస్తున్నారని షూటింగ్ సమయంలోనే తెలిసినప్పటికీ అడ్డుకోని గొప్ప సంస్కారం వరుణ్ తేజది. అలా హీరో, హీరోయిన్, నిర్మాత సైతం స్టార్ డమ్‌ను కాకుండా కథను, దర్సకుడు శేఖర్ కమ్ములను నమ్మారు కాబట్టే ఒక గొప్ప కాదు కాదు ఒక మంచి సినిమా  మన ముందుకొచ్చింది.

తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా ఇతర  ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలోసక్సెస్ అవుతుందా అని మొదట్లో ఉన్న భయాలు కూడా ఫిదా విడుదలయ్యాక పటాపంచలయ్యాయి.అన్ని ప్రాంతాలనుంచి వస్తున్న టాక్‌ని చూస్తే ఫిదా సినిమా తప్పకుండా  ఎవరూ ఊహించని భారీ కలెక్షన్లనే సాదిస్తుందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వంటి సుదూర రాష్ట్రాల్లో కూడా ఫిదా సినిమా హౌస్ పుల్‌గా రన్ అవుతుందంటే  నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ తదితర తారలు ఫిదాలో మ్యాజిక్ సృష్టించినట్లే మరి.తెలంగాణ నేపథ్యంలో తీసినా.. మంచి కథను ప్రేక్షకులు ప్రాంతాలు, కులాలకు అతీతంగా చూస్తారనడానికి మన కాలంలో ఫిదా గొప్ప ఉదాహరణ.

ఫిదాను ఇలాగే చూద్దాం.