YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి కారణం తన తోబుట్టువు జగనన్నే కారణమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నుండి విజయసాయి రెడ్డి నిష్క్రమించడం చిన్న విషయం కాదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి వంటి సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి పార్టీని విడిచిపెట్టినప్పుడు, అది వైఎస్ఆర్సీపీలోని దారుణమైన పరిస్థితిని ప్రతిబింబిస్తుందని షర్మిల చెప్పారు.
నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుందని అని షర్మిల ఎద్దేవా చేశారు. నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి తన విశ్వసనీయతను కోల్పోయారని ఆమె ఆరోపించారు.
జగన్ ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం సాయి రెడ్డి పని అని ఆరోపించారు. రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్‌ను విజయసాయి రెడ్డి ఎందుకు వదిలేశారు? ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారు? ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్‌కు దూరమవుతున్నారు? అన్న విషయాలను వైసీపీ శ్రేణులు ఆలోచించాలన్నారు.
నా అనుకున్న వాళ్ళను కాపాడుకోలేక పోతున్నాడన్నారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడని ఆరోపించారు. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషమన్నారు. సాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల.