ఉచ్చారణ, స్వచ్చమైన నటనకు పెట్టింది పేరు గుమ్మడి
నేడు, జూలై 9న మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.జయంతి
తెలుగు సినీరంగం స్వర్ణయుగంలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఇంటిపేరుతోనే చలామణి అయ్యారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో అలరించారు. అచ్చమైన తెలుగు భాష, స్వచ్చమైన నటనతో ఏ పాత్రను పోషించినా అందులో ఒదిగిపోయేవారు. 1927, జూలై 9న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆరోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు ఎక్కువగా జరిగేవి. పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు భలేగా నచ్చేవి. అలా ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అయింది. ఒకపక్క తండ్రి వ్యవసాయం చేయమంటే చేస్తూనే ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదివేవాడు. 17ఏళ్ళకే పెండ్లి చేయడంతో చదువు పెద్దగా సాగలేదు. అయినా ఇంటర్‌వరకు చేరారు. అనంతరం ఆయన చూపు నాటకాలపై మళ్లింది. అప్పట్లో దుర్యోధనుడిగా ఆయన బాగా మెప్పించారు. ఆ ప్రయాణం అలా మదరాసుకు పయనమైంది.
1950లో `అదృష్టదీపుడు`లో నటుడిగా అవకాశం వచ్చింది. అయినా ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఎన్.టి.ఆర్. ఆయన్ను ప్రోత్సహించారు. పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు సినిమాలు గుమ్మడికి గుర్తింపుతెచ్చి పెట్టాయి. ఆ తర్వాతనుంచి దాదాపు ఐదు దశాబ్దాలు సినిమారంగంలో పెనవేసుకుపోయారు. దాదాపు 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. విలక్షణ పాత్రలు వేయడం ఆయన శైలి. సాంఘిక చిత్రాల్లో అన్నగా, తండ్రిగా, తాతగా మెప్పించారు. పౌరాణికాలలో వశిష్ట మహర్షి, విశ్వామిత్రుడు, భీష్ముడు, బలరాముడు వంటి పాత్రలు విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. చారిత్రక చిత్రాలలో పోతన, కబీరుదాసు, మహామంత్రి తిమ్మరుసు పాత్రలు ఆయకు మరింత గుర్తింపునిచ్చాయి. ఇక సాత్వికాభినయంలో విలనిజాన్ని మెప్పించారు. లక్షాధికారి, నమ్మినబంటు చిత్రాలు ఇందుకు నిదర్శనం.
మాహామంత్రి తిమ్మరుసులో రాజు పాత్ర ఎన్.టి.ఆర్.కీ గుమ్మడి చెరసాలలో జరిగే సన్నివేశం కంటనీరుపెట్టిస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆయనకు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. ఆ తర్వాత చివరి దశలో ఆయనకు అనారోగ్యం ప్రాప్తించింది. 2008వరకు ఆయన తనవద్దకు వచ్చిన పాత్రలు చేస్తూనే వున్నారు. ఆ సమయంలో తన గొంతుకు ఆపరేషన్ జరగడంతో డబ్బింగ్ వేరేవారితో చెప్పించేవారు. అలా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటిలోనే వున్న ఆయన 2010 జనవరి 26న కన్నుమూశారు. ఆయన వారసులు ఎవ్వరూ సినిమారంగంలోకి రాలేదు. ఆయన పెద్ద కుమారుడు అచ్చు గుమ్మడినే తలపిస్తారు. ఇక ఆయన అభిమానులు ఆయన కాంస్యవిగ్రహాన్ని పోతర్లంక గ్రామంలో ప్రతిష్టించారు. ఇలా పరిపూర్ణ జీవితాన్ని చవిచూసిన నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.