పెళ్లి సేఫ్ సెక్స్ కోసం అనేది తెలియాలంటే `షాదీ ముబారక్` చూడాల్సిందేః హీరో వీర్‌సాగర్
టీవీ నటుడిగా పేరు తెచ్చుకున్న
వీర్‌సాగర్ ప్రస్తుతం `షాదీ ముబారక్` సినిమాతో హీరోగా మారాడు. వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ శుక్రవారమే విడుదలకానున్న ఈ సినిమా గురించి సాగర్ చెప్పిన విశేషాలు.
- ఇది వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ చేశాను. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది.
- కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేస్తారనే పేరు దిల్‌రాజుగారికి ఉంది. ఆ నమ్మకంతోనే నేను ఆయన్ని ఈ సినిమా కోసం కలిశాను. ముందు ఆయన ట్రైలర్ చూశారు. బాగా నచ్చింది. ఆయనకు నమ్మకం వచ్చిన తర్వాతే మేం ముందుకు వెళ్లాం.
- ఒక ఎన్నారై యువకుడు పెళ్లి చూపులు కోసం ఇండియా వస్తాడు. అక్కడ మ్యారేజ్ బ్యూరోకి చెందిన ఓ అమ్మాయిని కలుస్తాడు. వారి ప్రయాణంలో జరిగే పరిణామాలు ఎలా మారాయనేదే ఈ సినిమా. మామూలుగా ప్రతి ఒకరి జీవితంలో పెళ్లి, పెళ్లి చూపులు జరుగుతుంటాయి. ఆ పాయింట్‌తో చేసిన ఈ సినిమాను చూసిన వారందరూ కనెక్ట్ అవుతారు. సినిమాలోని పాత్రలను మనం ఎక్కడో చూసిన ఫీలింగే కలుగుతుంది. ట్రైలర్‌లో పెళ్లి సేఫ్ సెక్స్ కోసం అనే డైలాగ్ వుంది. దాని గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
- సీరియల్ నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం.. నేను అప్పటి వరకు సీరియల్స్‌లో చేసిన పెద్ద క్యారెక్టర్స్ మళ్లీ రావు. అందువల్ల అక్కడి నుంచి షిఫ్ట్ అయితే మంచిది అనే ఫీలింగ్ వచ్చింది. అందువల్ల సినిమాల్లో ప్రవేశించాను. ఇక్కడకు వచ్చిన తర్వాత నేను చేసిన సిద్ధార్థ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమాలు సీరియల్‌లో నేను చేసిన పాత్రలకు దగ్గరగా ఉన్నాయి. అలా కాకుండా ఛేంజ్ ఓవర్ కోసం చేసిన సినిమానే షాదీ ముబారక్.
- ప్రస్తుతానికి మళ్లీ సీరియల్స్ చేయాలనే ఆలోచన లేదు.
- డైరెక్టర్ పద్మశ్రీ, రైటర్‌గా కృష్ణవంశీగారి దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేశారు. నిజానికి ఈ సినిమాను కృష్ణవంశీగారే ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు. కానీ నేను కథ వినగానే నా స్నేహితులతో కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను.
- సునీల్ కశ్యప్‌గారు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఆయన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్ అవుతుంది.
- సినిమా హీరోయిన్‌గా చేయబోయే అమ్మాయి గురించి చాలా రోజులు వెయిట్ చేశాను. మన పక్కింటి అమ్మాయిని చూశామనే ఫీలింగ్ కలిగేలా హీరోయిన్ ఉంటే బావుంటుందని యూనిట్ భావించింది. ఆ సమయంలో దృశ్యా రఘనాథ్ మాకు నచ్చడంతో ఆమెను అప్రోచ్ అయ్యాం. ఆమె పాత్ర కోసం దాదాపు ఒకటిన్నర నెల వర్క్‌షాప్‌లో ఉండి తెలుగు నేర్చుకుని మరీ నటించింది.
- తర్వాత స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. గౌతమ్ మీనన్ అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నాడు.